లండన్: హార్మోన్ రిప్లేస్మెంట్, జెండర్ సర్జరీ చేసుకున్న మాజీ క్రికెటర్ , కోచ్ సంజయ్ బంగర్ కూతరు అనయా బంగర్ కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. సంజయ్ కుమారుడు ఆర్యా .. ఓ అథ్లెట్. ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడాడు. కానీ ఆ తర్వాత ఆ పిల్లోడు జెండర్ సర్జరీ చేయించుకున్నాడు. పేరును ఆర్యా నుంచి అనయా(Anaya Bangar)గా మార్చుకున్నారు. లింగమార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత క్రికెట్ కెరీర్లో ఎదురైన అవాంతరాల గురించి ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అనయా .. బ్రిటన్‌లో నివసిస్తోంది.
క్రికెట్ ప్రపంచంలో పురుషాధిక్యం విషపూరితంగా ఉన్నట్లు చెప్పిందామె. లలన్‌టాప్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 8 ఏళ్ల వయసులో తన తల్లి దుస్తుల్ని వేసుకునే దాన్ని అని, అమ్మ కప్బోర్డు నుంచి వాటిని తీసి ధరించేదాన్ని అని, అద్దంలో చూస్తూ నేను అమ్మాయిని అని, అమ్మాయిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పేదాన్ని అని పేర్కొన్నది.
చాలా మంది పేరున్న క్రికెటర్లతో ఆడానని.. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లాంటి వారితో ఆడినట్లు ఆమె గుర్తు చేశారు. తండ్రికి మంచి పేరున్న కారణంగా తన సీక్రెసినీ మెయిన్టేన్ చేయాల్సి వచ్చిందని, క్రికెట్ ప్రపంచంలో అభద్రత నిండి ఉందని, పురుష అహంకారం కూడా ఉందన్నారు.
జెండర్ సర్జరీ చేయించుకున్న తర్వాత తోటి క్రికెటర్ల స్పందన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ… కొందరు సపోర్టు ఇచ్చారని, కొన్ని చోట్ల వేధించారని అనయ పేర్కొన్నది. ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని ప్రశ్న వేయగా, ఆమె బదులిస్తూ.. కొందరు క్రికెటర్లు తరుచూ నగ్న ఫోటోలను తనకు పంపారని ఆమె చెప్పారు. ఓ వ్యక్తి తనతో దుర్భాషలాడినట్లు గుర్తు చేసింది. అందరి ముందు అతను తిట్టేవాడని, ఆ వ్యక్తే మళ్లీ దగ్గరకు వచ్చి, తన ఫోటోలు అడిగేవాడని చెప్పింది. ఇండియాలో ఉన్నప్పుడు మరో సంఘటన జరిగిందని, తన పరిస్థితి గురించి తన తోటి మాజీ క్రికెటర్‌కు చెప్పానని, కారులో వెళ్దామని చెప్పి, తనతో పడుకోవాలని ఉందని అతను చెప్పినట్లు అనయ పేర్కొన్నది.
సంజయ్ బంగర తరహాలో అనయ .. ఇస్లామ్ జింఖానా క్లబ్‌కు క్రికెట్ ఆడింది. లీషెస్టర్ హింక్లే క్రికెట్ క్లబ్ తరపున కూడా ఆడింది. అయితే ఐసీసీ నుంచి అనయకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు.. మహిళా క్రికెట్లో ఆడే అవకాశం లేదని ఇటీవల ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ కొత్త రూల్‌పై నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ అనయ తన ఇన్‌స్టాలో ఓ పోస్టు కూడా పెట్టింది.