ముంబై: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అనయ.. తానెదుర్కున్న లైంగిక వేధింపులపై సంచలన విషయాలు వెల్లడించింది. తాను అమ్మాయినని తెలిశాక కొంతమంది క్రికెటర్లు తనకు అసభ్యకర ఫొటోలు పంపేవారని, ఓ క్రికెటర్ అయితే తనతో ఓ రాత్రి గడపాలని వేధించాడని తెలిపింది.
‘ది లలన్‌టాప్’ అనే యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయ మాట్లాడుతూ.. “నా చిన్నతనంలో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి క్రికెటర్లతో క్రికెట్ ఆడా. నాన్న ప్రముఖ క్రికెటర్ అవడంతో నా గురించి నేను వారెవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత పురుషత్వంతో నిండి ఉంది.
నేను అమ్మాయినన్న విషయం తెలిశాక బయట ప్రపంచం నుంచే గాక సహచర క్రికెటర్ల నుంచీ వేధింపులు మొదలయ్యాయి. కొందరు నన్ను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారు. మరికొంతమంది వాళ్ల నగ్న ఫొటోలు నాకు పంపారు. ఒకరైతే అందరి ముందు నాకు మద్దతుగా మాట్లాడేవాడు. కానీ ఎవరూ లేనప్పుడు పక్కనే కూర్చుని నా ఫొటోలు పంపమనేవాడు. నేను భారత్‌లో ఉన్నప్పుడు (ప్రస్తుతం అనయ మాంచెస్టర్‌లో ఉంటున్నది) ఓ వెటరన్ క్రికెటర్‌కు నా పరిస్థితి చెబితే.. ‘మనం కారులో వెళ్దాం పదా’ అని బయటకు తీసుకెళ్లి ‘నాకు నీతో గడపాలని ఉంది’ అని అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురయ్యా” అని షాకింగ్ విషయాలు వెల్లడించింది.