లాస్ ఏంజెల్స్ : ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్‌ను ఉన్న క్రేజ్‌ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్‌లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. లాస్ఏంజెల్స్ నుంచి 50కి.మీల దూరంలో ఉండే పొమెనా వేదికగా జూలై 12 నుంచి క్రికెట్ పోటీలకు తెరలేవనుంది. జూలై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ శతాబ్దంలో తొలిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించారు. చివరిసారి ఫ్రాన్స్ వేదికగా 1900లో జరిగిన విశ్వక్రీడల్లో క్రికెట్ భాగమైంది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలన్న ఐసీసీ విజన్‌కు అనుగుణంగా..అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇన్నేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం జరుగబోతున్న క్రికెట్ పోటీల్లో మహిళలు, పురుషుల నుంచి మొత్తం ఆరేసి జట్లు టీ20 ఫార్మాట్లో జరుగనున్నాయి. మొత్తం 12 జట్లలో ఒక్కో జట్టు.. 15 మంది చొప్పున ఆడేందుకు ఐవోసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇందుకోసం పురుషుల, మహిళల విభాగాల్లో వేర్వేరుగా 90 మందితో కోటాను క్రికెట్‌కు కేటాయించారు. అమెరికాలోని గ్రాండ్ పియరీ, లాడర్‌హిల్, న్యూయార్క్ ఒలింపిక్స్ క్రికెట్ మ్యాచ్‌లను ఆతిథ్యమివ్వనున్నాయి. 2024లో వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అనుభవం అమెరికాకు ఉపయోగపడనుంది. ‘అమెరికా ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ఒలింపిక్స్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు మిలియన్‌కు పైగా అథ్లెట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా క్రీడలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు’ అని లాస్ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌తో పాటు బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్(సిక్సెస్) కొత్తగా చోటు కల్పించిన సంగతి తెలిసిందే.