ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు ఇది శుభవార్త. అతడు కెప్టెన్సీ చేయకుండా గతంలో నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) త్వరలో ఆ నిర్ణయాన్ని ఎత్తివేయనున్నది. ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నిర్ణయంతో వార్నర్ భాయ్.. బిగ్ బాష్ లీగ్ లో సారథ్యం వహించే అవకాశాన్ని పొందనున్నాడు. అసలు వార్నర్ మీద నిషేధం ఎందుకు విధించారంటే…
2018 లో దక్షిణాఫ్రికా తో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ కు పాల్పడినందుకు గాను డేవిడ్ వార్నర్ తో పాటు అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ల మీద సీఏ నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్ మీద 9 నెలల పాటు (దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులలో ఆడకుండా) బ్యాన్ వేయగా.. వార్నర్, స్మిత్ లపై ఏడాది నిషేధం విధించింది. దీంతో పాటే వార్నర్ కు ఆసీస్ దేశవాళీ, జాతీయ జట్టులలో సారథ్యం వహించకుండా జీవితకాల నిషేధం వేసింది.
ఏడాది విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వార్నర్ భాయ్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున సారథిగా వ్యవహరించాడు. గత సీజన్ వరకు అతడు ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఇక కొంతకాలంగా ఏ మచ్చ లేకుండా వివాదాలకు దూరంగా ఉంటున్న వార్నర్ కు సీఏ ఊరటనివ్వనున్నట్టు సమాచారం. అతడిపై విధించిన కెప్టెన్సీ బ్యాన్ ను ఎత్తివేయాలని సీఏ భావిస్తున్నదట.
ఇదే జరిగితే ఆసీస్ లో ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ లో అతడు కెప్టెన్ గా ఉండే అవకాశం దక్కుతుంది. వార్నర్ గతంలో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడేవాడు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న అతడికి జాతీయ జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆసీస్ లో టెస్టు జట్టుకు ప్యాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తుండగా.. వన్డే, టీ20లలో కెప్టెన్ గా ఉన్న ఆరోన్ ఫించ్ బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా విఫలమవుతున్నాడు. మరి సీఏ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వార్నర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.