Manu Bhaker | ఢిల్లీ: భారత ఒలింపిక్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన యువ షూటర్ మను భాకర్ పేరును కేంద్ర అత్యున్నత పురస్కారమైన ‘ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర’కు సిఫారసు చేయలేదన్న వివాదం నానాటికీ ముదురుతోంది. దీనిపై మను కోచ్ జస్పాల్ రాణా స్పందిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..
‘ఖేల్త్న్రకు మను దరఖాస్తు చేసుకోలేదని వాళ్లు ఎలా చెబుతారు? ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించి ఆమె చరిత్ర సృష్టించింది. దరఖాస్తు చేయకున్నా ఆమె పేరు జాబితాలో ఉండాలి. ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణి తనకు అవార్డు కావాలని ఎందుకు దరఖాస్తు చేయాలి? అక్కడున్నవారికి మను ఎవరో? దేశం కోసం ఏం సాధించిందో తెలియదా? అత్యున్నత స్థాయిలో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులకు అవార్డులను అందజేయాలి. వాళ్లను ఎలా మరిచిపోతారు? ఒక అథ్లెట్‌ను ఇలా ట్రీట్ చేయడం ఆమె పురోగతిని అడ్డుకోవడమే’ అని అసహనం వ్యక్తం చేశారు.