Gongidi Trisha | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టు సభ్యురాలైన తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిషకు తగిన ప్రోత్సాహం లభించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన భద్రాచలం అమ్మాయి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది.
బుధవారం హైదరాబాద్‌లో త్రిషను సీఎం రేవంత్‌రెడ్డి శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో మరింతగా రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. త్రిషతో పాటు ప్రపంచకప్ విజయంలో భాగమైన క్రికెటర్ కేసరి ధ్రుతి, చీఫ్ కోచ్ నౌషిన్ అల్ఖదీర్, ట్రైనర్ షాలిని 10 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.