హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్, ద్రోణవల్లి హారిక ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన అర్జున్, హారికకు ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రకటించింది.
శుక్రవారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి..అర్జున్‌తో పాటు హారికను శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్జున్, హారిక కుటుంబసభ్యులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.