శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 29, 2020 , 23:45:31

అదే తడబాటు

అదే తడబాటు

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్‌ తీరుమారలేదు. తొలి టెస్టు ఓటమితో ఆటగాళ్లలో కాస్త కసి పెరిగినట్టు కనిపించినా.. చెత్తషాట్లు మాత్రం మానలేకపోయారు. పచ్చికపిచ్‌పై అదే తడబాటు కొనసాగించారు. పృథ్వీ షా, పుజారా, విహారి అర్ధశతకాలతో రాణించినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. ఈ ముగ్గురు మినహా మిగిలిన వారు కనీసం కాసేపైనా నిలబడలేకపోయారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విఫలయాత్ర కొనసాగగా.. రహానే, పంత్‌ తీవ్రంగా నిరాశపరిచారు. కివీస్‌ పొడగరి పేసర్‌ జెమీసన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటితే.. సౌథీ పదోసారి విరాట్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసున్నాడు. న్యూజిలాండ్‌ పేసర్లు అదరగొట్టిన పిచ్‌పై మన బౌలర్లు తేలిపోయారు. 23 ఓవర్లు వేసి కనీసం ఒక్క వికెట్‌ తీయలేక చేతులెత్తేశారు.

  • భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం..
  • తొలి ఇన్నింగ్స్‌ 242 ఆలౌట్‌

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పేస్‌, స్వింగ్‌కు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ మళ్లీ తడబడ్డారు. కివీస్‌ బౌలర్‌ జెమీసన్‌(5/45) ఐదు వికెట్లతో చెలరేగడం సహా మిగిలిన వారు రాణించడంతో పచ్చికతో నిండిన పిచ్‌పై అష్టకష్టాలు పడ్డారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడ ప్రారంభమైన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా(54), నయావాల్‌ చతేశ్వర్‌ పుజార(54), తెలుగు ప్లేయర్‌ హనుమ విహారి(55) అర్ధశతకాలతో రాణించినా మిగిలిన వారు విఫలమయ్యారు. విరాట్‌ కోహ్లీ(3) మళ్లీ చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(27బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌(29బ్యాటింగ్‌) నిలువడంతో న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోకుండా 63పరుగులు చేసి తొలి రోజు పైచేయి సాధించింది.     


పృథ్వీ విజృంభణ 

టీమ్‌ఇండియాకు టాస్‌ రూపంలోనే తొలిషాక్‌ తగిలింది. రెండు, మూడు రోజుల్లో పిచ్‌ బ్యాటింగ్‌ సులువు కానున్న నేపథ్యంలో టాస్‌ గెలువాలని భావించిన కోహ్లీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(7) త్వరగానే ఔటైనా పృథ్వీ షా మాత్రం ఆకట్టుకున్నాడు. లంచ్‌ తర్వాత కాసేపటికే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(3) స్వల్పస్కోరుకే వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగి పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. ఓ డీఆర్‌ఎస్‌ అవకాశాన్ని చేజార్చి మరింత విమర్శల పాలయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న పుజార తన శైలిలో ఆడుతూ పోతే.. రహానే(7) కాసేపటికే పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన తెలుగు కెరటం హనుమ విహారి ఎదురుదాడికి దిగి అర్ధసెంచరీ తర్వాత ఔటయ్యాడు.  


22 పరుగుల వ్యవధిలో 5వికెట్లు 

అప్పటి వరకు మోస్తరుగా సాగిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ టీ విరామం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తొలుత పుజారను కివీస్‌ బౌలర్‌ జెమీసన్‌ పెవిలియన్‌ బాట పట్టించగా.. ఆ తర్వాత పంత్‌(17)ను బౌల్డ్‌ చేశాడు.  దీంతో ఓ దశలో 194/4తో ఉన్న భారత్‌ 216/9తో నిలిచి, 22పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.

 

ఒక్క వికెట్‌ పడకుండానే..

భారత్‌ పది వికెట్లు చేజార్చుకున్న పిచ్‌పైనే ఆ తర్వాత న్యూజిలాండ్‌ ఓపెనర్లు లాథమ్‌(27బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌(29బ్యాటింగ్‌) ఆకట్టుకున్నారు. 


09కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 14సార్లు ఎల్బీలపై డీఆర్‌ఎస్‌కు వెళ్లగా.. రెండుసార్లే అనుకూల ఫలితం పొందాడు. మరో 3సార్లు అంపైర్‌ కాల్స్‌ రాగా.. 9సార్లు  అవకాశాన్ని వృథా చేశాడు. 

10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లీని కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ ఔట్‌ చేయడం ఇది పదోసారి. కోహ్లీని అత్యధిక సార్లు పెవిలియన్‌కు పంపిన రికార్డు అతడిదే. 


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)లాథమ్‌ (బి)జెమీసన్‌ 54; మయాంక్‌ అగర్వాల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్‌ 7; పుజార (సి)వాట్లింగ్‌ (బి)జెమీసన్‌ 54; విరాట్‌ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి)సౌథీ 3; రహానే (సి)టేలర్‌ (బి)సౌథీ 7; విహారి (సి)వాట్లింగ్‌ (బి)వాగ్నర్‌ 55; పంత్‌ (బౌల్డ్‌) జెమీసన్‌ 12; జడేజ (సి)బౌల్ట్‌ (బి)జెమీసన్‌ 9; ఉమేశ్‌ (సి)వాట్లింగ్‌ (బి)జెమీసన్‌ 0; మహమ్మద్‌ షమీ (బౌల్డ్‌) బౌల్ట్‌ 16; బుమ్రా నాటౌట్‌ 10, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 63ఓవర్లలో 242ఆలౌట్‌. వికెట్ల పతనం: 30-1, 80-2, 85-3, 113-4, 194-5, 197-6, 207-7, 207-8, 216-9, 242-10 బౌలింగ్‌: సౌథీ 13-5-38-2, బౌల్ట్‌ 17-2-89-2, గ్రాండ్‌హోమ్‌ 9-2-31-0, జెమీసన్‌ 14-3-45-5, వాగ్నర్‌ 10-2-29-1 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ బ్యాటింగ్‌ 27; బ్లండెల్‌ 29బ్యాటింగ్‌, ఎక్స్‌ట్రాలు: 7 మొత్తం: 23ఓవర్లలో 63/0 బౌలింగ్‌: బుమ్రా 7-1-19-0, ఉమేశ్‌ 8-1-20-0, షమీ 7-1-17-0, 1-1-0-0.


logo