హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై హెచ్‌సీఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ ప్రయోజనాలతో హెచ్‌సీఏ ఎన్నికల్లో దల్జీత్ గెలుపొందారని అంబుడ్స్‌మన్, సీఐడీకి ఫిర్యాదు చేసిన కాపీలో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. 2022 వరకు కమర్షియల్ టాక్సెస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన బసవరాజు.. ప్రభుత్వ ఉద్యోగ విరమణ అనంతరం దల్జీత్‌సింగ్ కుటుంబానికి చెందిన అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్‌కు ఉపాధ్యక్షుడిగా 2023లో బాధ్యతలు చేపట్టారని తెలిపారు.
కాగా, ఏండ్లుగా దల్జీత్‌సింగ్ కుటుంబం ఆధ్వర్యంలోనే అమీర్‌పేట్ క్రికెట్ క్లబ్, ఖాల్సా క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయని చెప్పారు. గతంలో మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ కల్గిన 57 క్లబ్స్పై జస్టిస్ లావు నాగేశ్వరావు వేటు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేరూల్ ప్రకారం దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన క్లబ్స్పైనా సస్పెన్షన్ విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన రెండు క్లబ్‌ల నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి పదవులు అనుభవించారని చెప్పారు. హెచ్‌సీఏ రాజకీయాలు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అక్రమంగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.