బీజింగ్: చైనా టెన్నిస్ ప్లేయర్ ఫెంగ్ షూయి ఆచూకీపై మహిళా టెన్నిస్ సంఘం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ స్టార్ ప్లేయర్ ఫెంగ్ షూయి.. ఆదివారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో వీడియో కాల్లో మాట్లాడారు. క్షేమంగా ఉన్నట్లు ఆమె చెప్పింది. ఫెంగ్తో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఫెంగ్ అద్భుతంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒలింపిక్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. చైనాకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫెంగ్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణ చేసిన తర్వాత.. మూడు వారాల నుంచి ఆమె ఆచూకీ లేకుండాపోయింది. అదృశ్యమైన ఫెంగ్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫెంగ్ ఆనవాళ్లు ఎక్కడో చెప్పాలంటూ చైనాపై వత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఓసీ అధ్యక్షుడితో ఫెంగ్ వీడియో కాల్లో మాట్లాడింది.