రాజ్‌కోట్ : సుమారు దశాబ్దకాలం పాటు టెస్టుల్లో భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన ‘నయా వాల్’ ఛటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆదివారం అతడు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ప్రకటించాడు. 13 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో భారత్ తరఫున 103 టెస్టులాడిన పుజారా.. 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 19 శతకాలు, 35 అర్ధ శతకాలున్నాయి. 2010లో భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన పుజ్జీ (పుజారా ముద్దుపేరు).. టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్ వదిలివెళ్లిన మూడో స్థానాన్ని వందకు వందశాతం భర్తీచేసి భారత క్రికెట్ అభిమానులతో ‘నయా వాల్’ అనిపించుకున్నాడు. చివరిసారిగా అతడు 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా టీమ్ఇండియా తరఫున ఆస్ట్రేలియాతో ఆఖరి మ్యాచ్ ఆడాడు. కొత్త కుర్రాళ్ల రాకతో పాటు ఫామ్‌లేమితో జట్టుకు దూరమైన ఈ సౌరాష్ట్ర దిగ్గజం.. తన చివరి మ్యాచ్ ఆడిన రెండేండ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేలలో అతడు భారత్ తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాడు.
భారత క్రికెట్లో ముఖ్యంగా టెస్టుల్లో తరానికి ఓ బ్యాటర్ టీమ్ఇండియాకు సైలెంట్ వారియర్స్‌లా పోరాడారు. భారత క్రికెట్ ఆరంభంలో ఆ బాధ్యతలను సునీల్ గవాస్కర్ మోస్తే ఆ తర్వాత ఆ భారాన్ని సుమారు రెండుదశాబ్దాల పాటు ద్రవిడ్ మోశాడు. మునపటితరంలో అత్యుత్తమ పేసర్లకు తనదైన డిఫెన్స్‌తో చుక్కలు చూపించిన ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా? అని చూస్తుండగా నేనున్నానంటూ వచ్చాడు పుజారా. దేశవాళీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతూ జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ అతడు.. 2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో టెస్టులో అరంగేట్రం చేశాడు. ద్రవిడ్ మాదిరిగానే బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారుతూ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటంలో దిట్ట అయిన పుజారా టెస్టు అరంగేట్రం తర్వాత రెండేండ్లకు హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తన తొలి టెస్టు శతకాన్ని సాధించాడు. ఆ తర్వాత రెండు నెలలకే ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ టెస్టులో డబుల్ సెంచరీ బాదాడు. పేసర్లకు స్వర్గధామంగా ఉండే సౌతాఫ్రికా పిచ్‌లపై 2013లో జోహన్నస్బర్గ్ టెస్టులో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్ వంటి మేటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని 153 రన్స్ చేసి మ్యాచ్‌ను కాపాడాడు. 2017లో రాంచీలో ఆసీస్‌తో ఆడిన టెస్టు అయితే అతడి కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పక తప్పదు. ఆ టెస్టులో ఏకంగా 525 బంతులను ఎదుర్కున్న అతడు.. 202 రన్స్ చేశాడు.
ఇక ఆస్ట్రేలియాలో భారత జట్టు 2018-19, 2020-21లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంలో పుజారాది కీలకపాత్ర. భారత జట్టు ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ విజయం సాధించిన 2018-19 సిరీస్‌లో పుజారా నాలుగు టెస్టులాడి 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఆ సిరీస్ అడిలైడ్ టెస్టులో ఆసీస్ పేస్ అటాక్‌కు భారత బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేయగా పుజ్జీ మాత్రం ఒంటిచేత్తో జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41/4తో ఉన్న జట్టును 246 బంతులెదుర్కుని 123 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 71 రన్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2021 పర్యటనలో ఆసీస్ పేసర్లు స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్ త్రయం.. పుజారా బాడీని టార్గెట్ చేస్తూ బంతులు సంధించినా అతడు వెరవలేదు. సిడ్నీ టెస్టును భారత్ కాపాడుకున్నా.. బ్రిస్బేన్‌లో చారిత్రత్మక విజయాన్ని సాధించినా అందులో పుజారా పాత్ర మరువలేనిది. రహానే, కోహ్లీతో కలిసి చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడెవరో చూడాలి మరి!
‘రాజ్‌కోట్ నుంచి కుటుంబంతో కలిసివచ్చిన ఓ అబ్బాయి.. భారత క్రికెట్లోకి అడుగుపెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. భారత జెర్సీని ధరించడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, మైదానంలో జట్టుకోసం నా అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభూతులు. కానీ ఎంత మంచి విషయాలకైనా ఎప్పుడో ఒకప్పుడు ముగింపు చెప్పాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐతో పాటు నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లకు, నాకు మద్దతుగా నిలిచినవారందరికీ కృతజ్ఞతలు’ -పుజారా