న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో CSK రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు రాబట్టింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మరే ఐపీఎల్ జట్టు కూడా ఢిల్లీలో అంత భారీ స్కోర్ చేయలేదు.
తాజాగా ఢిల్లీపై భారీ స్కోర్ చేయడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గతంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 2021 మే 2న ఢిల్లీలో సైన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇదే ఇప్పటివరకు ఢిల్లీలో ఆతిథ్య జట్టు మినహా ఇతర జట్టు చేసిన అత్యధిక స్కోరుగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు ఈ రికార్డును CSK బద్దలు కొట్టింది.
అయితే, ఓవరాల్‌గా చూసుకుంటే ఢిల్లీలో అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ టీమ్ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ పేరు మీదే ఉంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 223 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు రెండో స్థానంలో చేరింది. 220 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పడిపోయింది.