న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ (BCCI President) దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వారిద్దరూ కాకుండా తాజాగా ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఆయనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ బ్యాట్స్‌మెన్, మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిథున్ మన్హాస్ (Mithun Manhas). అధ్యక్ష పదవి రేసులో మన్హాస్ ముందున్నారని, నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బీసీసీఐకి చెందిన పలువురు ముఖ్య నిర్ణయాధికారులు, రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ఒక అనధికారిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిథున్ అభ్యర్థిత్వం ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలిసింది. బోర్డు భవిష్యత్ దృష్ట్యా సమతుల్య నిర్వహణ, రాష్ట్ర సంఘాల మధ్య సఖ్యత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచన వ్యక్తమైందని సమాచారం. ఇదేకనుక జరిగితే జమ్ముకశ్మీర్ నుంచి భారత క్రికెట్ పాలకవర్గం అత్యున్నత పదవిని చేపట్టనున్న వ్యక్తిగా మిథున్ నిలువనున్నాడు.
45 ఏండ్ల మిథున్ మన్హాస్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌కు మారాడు. ఆటగాడిగా, కోచ్‌గా పలు బాధ్యతలు చేపట్టారు. దులీప్ ట్రోఫీ నార్త్‌జోన్ కన్వీనర్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ సపోర్టింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ క్రికెట్ సంఘం (JKCA) అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మొత్తం 157 మ్యాచ్‌లు ఆడిన మన్హాస్ 9714 రన్స్ చేశాడు. అయినప్పటికీ జాతీయ జట్టు తలుపు తట్టలేకపోయాడు. అయితే ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ఈ నెల 23న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అవసరమైతే సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఓటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర యూనిట్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
కాగా, కోశాధికారి పదవికి కర్ణాటక వెటరన్ భట్ ముందంజలో ఉన్నారని, ఛత్తీస్‌గఢ్ క్రికెట్ సంఘానికి చెందిన ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రెటరీగా ఎన్నిక కానున్నట్లు తెలుస్తున్నది.