అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఒకే సినిమాలో నటించినట్లు..రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడినట్లు..ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఒకే పాటకు ట్యూన్ కట్టినట్లు..చెన్నై ఓపెనర్లు చెలరేగిపోయారు! బౌలర్ చేతి నుంచి బంతి పడటమే తరువాయి.. దాని లక్ష్యం బౌండ్రీనే అన్న చందంగా గైక్వాడ్, కాన్వే విరుచుకుపడటంతో సీజన్లో సూపర్ కింగ్స్ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది!
జడ్డూ నుంచి జట్టు పగ్గాలు తిరిగి అందుకున్న ధోనీ.. తన మహేంద్రజాలంతో చెన్నైని గెలుపు బాట పట్టించాడు. సారథి మారడంతోనే ఫుల్ జోష్‌లోకి వచ్చిన సూపర్ కింగ్స్.. తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేయగా.. నిన్నటి వరకు అనామక బౌలర్‌గా కనిపించిన ముఖేశ్ చౌదరీ.. ధోనీ సలహాలతో చెలరేగిపోయాడు. రెండొందల పై చిలుకు లక్ష్యఛేదనలో విలియమ్సన్, పూరన్ పోరాడినా ఫలితం లేకపోయింది!!
ముంబై: మొదట ఓపెనర్ల విజృంభణ.. ఆనక బౌలర్ల విశ్వరూపంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-15వ సీజన్లో మూడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ మిస్ చేసుకోగా.. కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. తాజా సీజన్లో మెరుపు వేగంతో బంతులేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ (0/48) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, ఒక సిక్సర్), కేన్ విలియమ్సన్ (47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆరంభం నుంచి ధాటిగా ఆడటంతో రైజర్స్‌కు శుభారంభం దక్కింది. వీరిద్దరి జోరుతో 4 ఓవర్లలోనే 46 పరుగులు జోడించిన హైదరాబాద్ ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించలేకపోయింది.
ఆరో ఓవర్లో ముఖేశ్ చౌదరీ వరుస బంతుల్లో అభిషేక్, రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేయగా.. రెండు సిక్సర్లతో ఆశలు రేపిన మార్క్మ్.్ర. మరో భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. 18వ ఓవర్లో శశాంక్ సింగ్ (15), వాషింగ్టన్ సుందర్ (2)ను ఔట్ చేసిన ముఖేశ్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కొట్టుడే కొట్టుడు..
మహేంద్రసింగ్ ధోనీ సారథ్య బాధ్యతలు అందుకోవడంతోనే చెనై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. గత మ్యాచ్‌ల్లో సాధారణ లక్ష్యాలను ఛేదించేందుకు కూడా ఇబ్బంది పడిన చెన్నై.. లీగ్‌లోనే అత్యంత పటిష్ట బౌలింగ్ దళం ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెలరేగి పోయింది. తన వేగంతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఉమ్రాన్ మాలిక్‌ను ఓ సాధారణ మీడియం పేసర్‌ను చేస్తూ.. చెన్నై ఓపెనర్లు రఫ్ఫాడించారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వంతులేసుకొని మరి వీరబాదుడు బాదారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్‌కు కాస్త మర్యాద ఇస్తూ.. జాగ్రత్తగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్, కాన్వే.. మిగిలిన వారిపై ప్రతాపం చూపారు.
ఉమ్రాన్ ఓవర్లో 4,6తో గైక్వాడ్ మోత మొదలెడితే.. మార్క్మ్ ఓవర్లో 4,6తో కాన్వే దాన్ని కొనసాగించాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లు దంచిన గైక్వాడ్ 33 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఉమ్రాన్ గంటకు 154 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని గైక్వాడ్ లాంగాన్ దిశగా కొట్టిన ఫోర్ చూసి తీరాల్సిందే. మార్క్మ్క్రు రెండు సిక్సర్లు రుచి చూపించిన గైక్వాడ్.. ఉమ్రాన్ బౌలింగ్‌లో మరోసారి 4,6 అరుసుకున్నాడు. జాన్సెన్ ఓవర్లో 6,4,6 కొట్టిన కాన్వే 39 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన అనంతరం.. సెంచరీకి పరుగు దూరంలో గైక్వాడ్ ఔట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ధోనీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కాన్వే చెన్నై స్కోరును రెండొందలు దాటించాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 202/2 (గైక్వాడ్ 99, కాన్వే 85 నాటౌట్; నటరాజన్ 2/42), హైదరాబాద్: 20 ఓవర్లలో 189/6 (పూరన్ 64 నాటౌట్; విలియమ్సన్ 47; ముఖేశ్ 4/46).