నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చెందామన్న బాధో.. లేక డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేయలేకపోతున్నామన్న కసో.. కానీ జడేజా సేన మైదానంలో శివతాండవం ఆడింది. వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప, యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే బంతిపై పగబట్టినట్లు విరుచుకుపడటంతో సిక్సర్ల హోరులో అభిమానులు తడిసి ముద్దయ్యారు. ఈ జోడీ పోటీ పడి బౌండ్రీలు బాదుతుంటే.. బెంగళూరు ఆటగాళ్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఆనక బౌలింగ్‌లో తీక్షణ, జడేజా తిప్పేయడంతో బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తాజా సీజన్లో నాలుగు పరాజయాల తర్వాత చెన్నైకి ఇది తొలి గెలుపు కాగా.. రాయల్ చాలెంజర్స్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ పడింది!
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐపీఎల్ 15వ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన సూపర్ కింగ్స్ మంగళవారం జరిగిన పోరులో 23 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శివమ్ దూబే (46 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. బెంగళూరు బౌలర్లలో వణిండు హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (8), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) విఫలం కాగా.. షాబాజ్ అహ్మద్ (41), ప్రభుదేశాయ్ (34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో మహేశ్ తీక్షణ 4, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబైతో పంజాబ్ తలపడనుంది.
చివరి 60 బంతుల్లో 156..
డిఫెండింగ్ చాంపియన్‌గా సీజన్ ప్రారంభించి.. బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (17) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. ప్రభుదేశాయ్ వేసిన మెరుపు త్రో కు మోయిన్ అలీ (3) రనౌటయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 2 వికెట్ల నష్టానికి 60 పరుగులే చేసింది. చెన్నైకి మరో పరాజయం ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఊతప్ప, దూబే విజృంభించారు. హసరంగా ఓవర్లో 6,4తో దూబే దంచుడు ప్రారంభిస్తే.. మ్యాక్స్‌వెల్ ఓవర్లో మూడు సిక్సర్లతో ఊతప్ప దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో బౌండ్రీతో ఊతప్ప ఐపీఎల్లో 27వ అర్ధశతకం పూర్తి చేసుకుంటే.. అదే ఓవర్లో దూబే 30 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు.
ఫలితంగా 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 133/2తో నిలిచింది. అప్పటి వరకు పొదుపుగా బౌలింగ్ చేసిన సిరాజ్ ఓవర్లో ఊతప్ప 6,6,4 దంచగా.. ఆకాశ్‌దీప్‌కు దూబే 6,4,6 రుచి చూపించాడు. హసరంగ ఓవర్లో చెరో సిక్సర్ అరుసుకోవడంతో జట్టు స్కోరు 200 దాటింది. మూడో వికెట్‌కు 74 బంతుల్లో 165 పరుగులు జోడించిన అనంతరం ఊతప్ప ఔట్ కాగా.. ఆఖరి ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన దూబే చెన్నైకి మరింత భారీ స్కోరు అందించాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొడితే దూబే సెంచరీ పూర్తయ్యే చాన్స్ ఉండగా.. భారీ షాట్ కొట్టడంలో అతడు విఫలమయ్యాడు. తొలి పది ఓవర్లలో 60 పరుగులు చేసిన జడ్డూ సేన.. చివరి 10 ఓవర్లలో 156 పరుగులు పిండుకుంది. ఈ మ్యాచ్‌లో 17 సిక్సర్లు కొట్టిన చెన్నై.. ఐపీఎల్లో తమ అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసింది.
టాప్ విఫలం..
భారీ లక్ష్యఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ డుప్లెసిస్ మూడో ఓవర్లో వెనుదిరగ్గా.. కాసేపటికే విరాట్ కోహ్లీ అతడిని అనుసరించాడు. అనూజ్ రావత్ (12) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఉన్నంత సేపు ధాటిగా ఆడిన ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బెంగళూరు 7 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 50 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో షాబాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. వీరిద్దరి జోరుతో ఇన్నింగ్స్ తిరిగి గాడిన పడ్డట్లు కనిపించగా.. లంక స్పిన్నర్ తీక్షణ వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్ పంపాడు. భారీ షాట్లతో విరుచుకుపడి చెన్నైని భయపెట్టిన దినేశ్ కార్తీక్‌ను బ్రేవో బుట్టలో వేసుకోవడంతో బెంగళూరుకు పరాజయం తప్పలేదు.
రాయుడో.. రాయుడు!
మైదానంలో చురుగ్గా కదలలేడనే ముద్ర పడ్డ అంబటి రాయుడు.. బెంగళూరుతో పోరులో కండ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని ఆకాశ్‌దీప్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. రాయుడు కుడి వైపు దూకుతూ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు.