న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే మెగాటోర్నీ కోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మందితో జట్టును ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతున్నది. స్టార్ బ్యాటర్ స్మృతి మందన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమ్ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా కలల కప్‌ను ముద్దాడాలని చూస్తున్న కౌర్‌సేన అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఓవైపు ప్రతిభ కల్గిన ప్లేయర్లకు అవకాశమివ్వడంతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్లకు జట్టులో చోటు కల్పించారు. ఇక కెరీర్ అయిపోయిందనుకున్న వెటరన్ పేసర్ శిఖాపాండే తిరిగి జట్టులోకి వచ్చింది.
అక్టోబర్ 2021లో చివరిసారి భారత్ తరఫున బరిలోకి దిగిన శిఖా ఇప్పటి వరకు మూడు టెస్టులు, 55 వన్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడింది. పరిస్థితులకు తగ్గట్లు స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగే సత్తా ఉన్న శిఖా చేరిక జట్టు బౌలింగ్ బలాన్ని పెంచే అవకాశముంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 1-4తో చేజార్చుకున్న టీమ్ఇండియాలోని లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పసలేని బౌలింగ్ భారత్ కొంపముంచుతున్నది. రేణుకా ఠాకూర్, పూజ వస్ర్తాకర్, అంజలి శర్వాణితో పేస్ బెంచ్ పటిష్ఠంగా కనిపిస్తున్నా..ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలం కాలేకపోతున్నారు.
ఈ యువ బౌలర్లను ముందుండి నడిపే సీనియర్ బౌలర్ లేకపోవడం ఒకింత లోటుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శిఖా పాండేను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. స్పిన్ బౌలింగ్ విషయానికొస్తే దీప్తిశర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌తో బలంగానే కనిపిస్తున్నది. మెగాటోర్నీకి వేదికైన దక్షిణాఫ్రికాలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయా లేదా అన్నది చూడాలి. మరోవైపు అండర్-19 ప్రపంచకప్ కోసం ఇప్పటికే షెఫాలీవర్మ, రిచా ఘోష్ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. వీరు కూడా జట్టుకు ఎంపికయ్యారు.
ముక్కోణపు సిరీస్‌కు జట్టు
మెగాటోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ప్రపంచకప్ టోర్నీకి రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన స్నేహ్ రానా, మేఘన, మేఘనా సింగ్‌ను ముక్కోణపు సిరీస్‌కు తీసుకున్నారు. సుశ్మ వర్మ తిరిగి జట్టులోకి రాగా, అమన్‌జ్యోత్ కౌర్ తొలిసారి ఎంపికైంది. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడే టోర్నీ జవవరి 19న మొదలుకానుంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి:
హర్మన్‌ప్రీత్‌కౌర్(కెప్టెన్), మందన(వైస్ కెప్టెన్), షెఫాలీవర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్, రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తిశర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్ర్తాకర్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖాపాండే.
ముక్కోణపు సిరీస్‌కు:
హర్మన్‌ప్రీత్‌కౌర్(కెప్టెన్), మందన(వైస్ కెప్టెన్), షెఫాలీవర్మ, యస్తికా భాటియా, రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తిశర్మ, దేవికా వైద్య, రాజేశ్వరీ గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, సుష్మా వర్మ, అమన్‌జ్యోత్ కౌర్, పూజా వస్ర్తాకర్, మేఘన, స్నేహ్ రానా, శిఖా పాండే