Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి జట్టును ప్రకటిస్తారు. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్న విషయం తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీ పాక్ వేదికగా జరుగనుండగా.. టీమిండియా మ్యాచులు దుబాయి వేదికగా జరుగనున్నది. చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాక్‌కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ పాక్‌ను ఒప్పించింది.
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించనున్నారు. రోహిత్, అగార్కర్ ముంబయిలో విలేకరుల సమావేశం నిర్వహించి జట్టును ప్రకటిస్తారు. జట్టు ప్రకటన అనంతరం కెప్టెన్ రోహిత్, అజిత్ అగార్కర్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శనివారం ముంబైలో భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటిస్తుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. జట్టు ఎంపిక తర్వాత విలేకరుల సమావేశం ఉంటుందని చెప్పింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొనున్నాయి. నాలుగేసి జట్ల చొప్పును రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో 12 మ్యాచులుంటాయి. ఆ తర్వాత రెండు సెమీఫైనల్స్.. ఆ తర్వాత ఫైనల్ ఉంటుంది. భారత్-పాక్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 23న దుబాయిలో జరుగనున్నది. భారత్ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో.. మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనున్నది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మార్చి 8న జరుగనున్నది.
చాంపియన్స్ కోసం ఇప్పటికే ఆరు టీమ్‌లను ప్రకటించారు. ఇంకా భారత్, పాక్ జట్లను ప్రకటించాల్సి ఉంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో జట్టు ప్రకటన ఆలస్యమైనట్లుగా సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 12 వరకు జట్టును ప్రకటించాల్సి ఉండేది. మార్పులకు అవకాశం ఉన్నా.. బీసీసీఐ మాత్రం జట్టు ప్రకటనకు ఐసీసీని సమయం కోరింది. ఆస్ట్రేలియా పర్యనటలో బుమ్రా వెన్ను నొప్పి కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దూరమయ్యాడు. గాయం విషయంలో బీసీసీఐ ప్రకటన చేయలేదు. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు మోకాలి గాయం కారణంగా కుల్దీప్ను ఆస్ట్రేలియా పర్యటకు దూరమయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ గాయం నుంచి కోలుకోగా.. జట్టులో చోటు లభిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
విజయ్ హజారే ట్రోఫీలో బ్యాటింగ్‌తో సత్తా చాటిన కరుణ్ నాయర్‌కు చోటు లభిస్తుందా? లేదా? చర్చ సాగుతున్నది. కరుణ్ ఏడు ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీ చివరి మ్యాచ్ శనివారం జరగనుంది. వరుస సెంచరీలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న కరుణ్‌కు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు అందుకునే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరకు అవకాశం వర్తిస్తుందా? లేదా చూడాల్సిందే.