Team India | పన్నెండేండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. సమిష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజేతగా నిలిచినప్పటికీ రోహిత్ సేన విజయాల్లో స్పిన్ మాంత్రికులది కీలక పాత్ర అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, చైనామెన్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌కు తోడుగా ఇటీవలే వన్డే జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి అంచనాలకు మించి రాణించారు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన ఈ చతుష్ఠయం.. ప్రత్యర్థులను తమ స్పిన్ ఉచ్చులో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. టీమ్ఇండియా తురుపు ముక్క జస్ప్రీత్ బుమ్రా గాయంతో వైదొలగడం.. ఏడాదిన్నర విరామం తర్వాత షమీ పునరాగమనం చేసి పూర్తిస్థాయిలో ఫామ్ సంతరించుకోకపోవడం.. అంతగా అనుభవం లేని హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ జట్టులో ఉండటంతో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనబడినా.. రోహిత్ సేన ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి బలమైన ప్రత్యర్థులను మట్టికరిపించిందంటే అది ఈ నలుగురి వల్లే. టోర్నీలో వరుణ్ మూడు మ్యాచ్‌లే ఆడి 9 వికెట్లు (అత్యధిక వికెట్ల వీరుల్లో అతడు రెండోస్థానంలో నిలిచాడు) పడగొట్టగా అక్షర్ (5 మ్యాచ్‌లలో 5), కుల్దీప్ (5 మ్యాచ్‌లలో 7), జడ్డూ (5 మ్యాచ్‌లలో 5) సత్తా చాటారు. టోర్నీలో ఈ నలుగురిలో ఏ ఒక్కరి ఎకానమీ రేట్ కూడా 4.8 దాటలేదు.
సాధారణంగా ఇద్దరు పేసర్లు, ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే టీమ్ఇండియా.. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఆడించి ఫలితాలను రాబట్టింది. స్లో పిచ్‌లకు నెలవైన దుబాయ్‌కు వెళ్లడానికి ముందే ఈ టోర్నీలో ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లను ఎంపిక చేసినప్పుడే అందరూ నోరెళ్లబెట్టారు. కుల్దీప్, అక్షర్ చాలునని జడ్డూ ఎందుకని విమర్శకులు పెదవి విరిచారు. అదీగాక అక్షర్ మినహా కుల్దీప్, జడ్డూ కూడా అంత గొప్ప ఫామ్‌లో కూడా లేకపోవడం విమర్శకుల ఆరోపణలకు బలమిచ్చింది. కానీ బంగ్లాతో మ్యాచ్‌లోనే ఈ త్రయం విలువేంటో విమర్శకులకు అర్థమైంది. ఈ ముగ్గురూ ఆ మ్యాచ్‌లో 2 వికెట్లే తీసినా తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలీకృతమయ్యారు. పాక్‌తో పోరులో ఈ త్రయం.. 5 వికెట్లు పడగొట్టింది. ఈ ముగ్గురినీ రోహిత్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఎంత టీ20లు వచ్చినా 50 ఓవర్ల పాటు సాగే వన్డే ఫార్మాట్లో బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో నెమ్మదిగా ఆడినా డెత్ ఓవర్లలో ధాటిగా ఆడతారు. కానీ రోహిత్ అనూహ్యంగా డెత్ ఓవర్లలో కుల్దీప్, అక్షర్ చేతికి బంతినిచ్చి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో విజయవంతమయ్యాడు. అక్షర్ అటు బంతితో పాటు బ్యాట్‌తోనూ ఆపద్బాంధవుడిగా నిలిచాడు.
వరుణ్ అయితే భారత్‌కు సర్ప్రైజ్ ప్యాకేజీ. టోర్నీ కోసం ముందుగా ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. కానీ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో సత్తా చాటిన అతడిని.. రిజర్వ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌కు గాయం అవడంతో దుబాయ్ విమానమెక్కించారు. తొలి రెండు మ్యాచ్‌లకు అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. వరుణ్ బౌలింగ్ నైపుణ్యానికి దుబాయ్ పిచ్ నప్పుతుందని భావించిన మేనేజ్మెంట్.. అతడిని న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడించింది. తన మిస్టరీ స్పిన్‌తో స్వదేశంలో ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆటాడుకున్న వరుణ్.. దుబాయ్‌లో కివీస్‌తో తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల ప్రదర్శన చేయడంతో అతడిని పక్కనబెట్టని పరిస్థితిని సృష్టించుకున్నాడు. 250 పరుగుల ఛేదనలో భాగంగా సాఫీగా లక్ష్యం వైపునకు సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చి ఆ జట్టు ఓటమికి పునాదులు వేసింది వరుణే. ఆ తర్వాత సెమీస్ పోరులో ప్రమాదకర ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిందీ అతడే. ఫైనల్లో పేసర్లను కివీస్ ఓపెనర్ రచిన్ దంచికొడుతుండటంతో రోహిత్ ఆరంభంలోనే వరుణ్, కుల్దీప్‌నకు బంతినివ్వడంతో మ్యాచ్ ఉన్నఫళంగా మలుపు తీసుకుంది. వరుణ్.. విల్ యంగ్‌ను ఔట్ చేసి కివీస్ జోరుకు బ్రేకులు వేస్తే, కుల్దీప్ వరుస ఓవర్లలో రచిన్, కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేసి ఆ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ స్పిన్నర్లతో ఏకంగా 38 ఓవర్లు వేయించి విజయానికి బలమైన పునాధులు వేసుకుంది.