IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భారీ స్కోర్ల మ్యాచ్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా లో స్కోరింగ్ గేమ్‌లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముల్లనూర్ వేదికా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. కొండంత స్కోర్ కొడుతుందనుకున్న పంజాబ్ 15.3 ఓవర్లకే కుప్పకూలగా.. హిట్టర్లతో నిండి కోల్‌కతా ఇన్నింగ్స్ 15.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. 112 పరుగుల ఛేదనలో యజ్వేంద్ర చాహల్(4-28) విజృంభణతో అల్లాడిన డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఆండ్రూ రస్సెల్(17) గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. కానీ, యాన్సెన్ అతడిని బౌల్డ్ చేసి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
టీ20 క్రికెట్ అంటేనే సంచనాలకు నెలవు. అంచనాలు తలకిందులు కావడం అన్నది ఈ ఫార్మాట్లో మామూలే. ఐపీఎల్ 18వ సీజన్ అచ్చం అలానే సాగుతోంది. సన్‌రైజర్స్‌పై 245 రన్స్ కొట్టిన పంజాబ్ కింగ్స్.. సొంతగడ్డపై 111కే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుంది అనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Are you not entertained? 🥳 pic.twitter.com/tTkKDm8MtZ
— Punjab Kings (@PunjabKingsIPL) April 15, 2025
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకొని కోల్‌కతాకు పెద్ద షాకిచ్చింది. చాహల్(4-28) విజృంభణతో ధాటిగా ఆడుతున్న అజింక్యా రహానే(17), అంగ్క్రిష్ రఘువంశీ(37)లు పెవిలియన్ చేరారు. దాంతో,76కే కోల్‌కతా 4 వికెట్లు పడ్డాయి. ఆ కాసేపటికే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్(7) ఎల్బీగా ఔటయ్యాడు.
62తో పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతాను చాహల్ దెబ్బకొట్టాడు. రహానేను ఎల్బీగా వెనక్కి పంపిన అతడు కాసేపటికే రఘువంశీని ఔట్ చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. అతడి స్పిన్ మాయాజాలంతో రింకూ సింగ్ స్టంపౌట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన రమన్‌దీప్ సింగ్ స్లిప్‌లో శ్రేయస్ చేతికి చిక్కాడు. అంతే.. యాన్సెన్ సూపర్ బాల్‌తో హర్షిత్ రానా(3)ను బౌల్డ్ చేసి కోల్‌కతాను ఆలౌట్ అంచుల్లోకి నెట్టాడు.
The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4
— IndianPremierLeague (@IPL) April 15, 2025
అయితే.. చాహల్ వేసిన 14వ ఓవర్లో ఆండ్రూ రస్సెల్(17) రెండో బంతిని లాంగాఫ్‌లో సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో 78 మీటర్ల సిక్సర్, ఫోర్‌తో 16 రన్స్ సాధించాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఓవర్లో వైభవ్ అరోరా(0) ఆఖరి బంతికి వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా రస్సెల్ ఉన్నాడనే భరోసాతో ఉన్న కోల్‌కతా ఆశల్ని ఆవిరి చేస్తూ యాన్సెన్ తొలి బంతికే బౌల్డ్ చేశాడు. అంతే.. 16 పరుగుల తేడాతో పంజాబ్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది.
𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮
Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG
— IndianPremierLeague (@IPL) April 15, 2025
టాస్ గెలిచి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్‌ను హర్షిత్ రానా(3-25) ఆదిలోనే దెబ్బకొట్టాడు. మొదట సిక్సర్లతో చెలరేగుతున్న ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(22)ను ఔట్ చేసిన అతడు.. రెండు బంతుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే జోష్ ఇంగ్లిస్(2)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు. పవర్ ప్లే ముగుస్తుందనగా రెండు సిక్సర్లు బాదిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ను హర్షిత్ డగౌట్‌కు పంపి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
Innings Break!
An exceptional bowling performance from #KKR, led by Harshit Rana, bundles #PBKS for 1️⃣1️⃣1️⃣
Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/cbWTsmAPii
— IndianPremierLeague (@IPL) April 15, 2025
క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఆదుకుంటాడని గ్లెన్ మ్యాక్స్‌వెల్(7)పై పంజాబ్ ఆశలు పెట్టుకుంది. కానీ, మ్యాక్సీ మరోసారి నిరాశపరచగా.. ఆ తర్వాత రంగంలోకి దిగిన సునీల్ నరైన్ (2-14) వికెట్ల వేట కొనసాగించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(4), మార్కో యాన్సెన్(1)లను పెవిలియన్ పంపాడు. సహచరులు వరుసగా ఔట్ అవుతున్నాశశాంక్ సింగ్(18) ఒంటరి పోరాటం చేశాడు. అయితే.. అతడిని ఎల్బీగా ఔట్ చేసిన వైభవ్ అరోరా పంజాబ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. ఆఖర్లో గ్జావియర్ బార్ట్లెట్(11) ధాటిగా ఆడి జట్టు స్కోర్ 100 దాటించాడు. అయితే.. 15.3వ ఓవర్లో అతడు రనౌట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 111 వద్ద ముగిసింది.