బెంగళూరు: దేశవాళీ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్, నార్త్ జోన్ సెమీస్‌కు దూసుకెళ్లాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మ్యాచ్‌తో పాటు ఈస్ట్ జోన్, నార్త్ జోన్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండు మ్యాచ్‌లు డ్రాగా తేలినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెంట్రల్, నార్త్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.
ఆట ఆఖరిరోజైన ఆదివారం సెంట్రల్ నిర్దేశించిన 679 పరుగుల భారీ ఛేదనలో నార్త్ ఈస్ట్ జోన్.. 200/6 వద్దే ఆగిపోయినా రజత్ పాటిదార్ సేనకు ఏకపక్ష విజయాన్ని అందకుండా పోరాడింది. నార్త్ ఈస్ట్ బ్యాటర్లలో వికెట్ కీపర్ జెహు అండర్సన్ (64), సారథి జొనాథన్ (60) ప్రత్యర్థి బౌలర్లను విసిగించారు. 40 పరుగుల వద్దే ఓపెనర్లను కోల్పోయిన ఆ జట్టు.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ ఓటమి గండం నుంచి గట్టెక్కింది.
ఈస్ట్, నార్త్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా పేలవమైన డ్రా గానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన నార్త్ జోన్.. ఏకంగా 658/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ కుర్రాడు అయుశ్ బదోని (223 బంతుల్లో 204 నాటౌట్, 13 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ద్విశతకం బాదాడు.