Vinesh Phogat – – CAS : ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) రజతం దక్కకపోవడం యావత్ భారతాన్ని నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న అర్బిట్రేషన్ కోర్టు వినేశ్‌కు పతకం ఇవ్వడం లేదంటూ చెప్పిన చేదు వార్త ఇంకా మింగుడు పడడం లేదు. అయితే.. ఏ కారణం చెప్పకుండానే వినేశ్ ఫోగొట్కు పతకం నిరాకరించడాన్ని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాస్ సోమవారం 24 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది. అందులో కాస్ ఏం చెప్పిందంటే..?
విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపులు ఉండవని కాస్ చెప్పింది. వినేశ్ ఫొగాట్ విషయంలోనూ తాము అదే నియమాన్ని అనుసరించామని అర్బిట్రేషన్ కోర్టు తన 24 పేజీల తీర్పులో తెలిపింది.
‘అథ్లెట్లకు సమస్య ఏంటంటే బరువు విషయంలో రూల్ అంటే రూల్. అది పోటీల్లో పాల్గొనే అందరికీ ఒకేలా ఉంటుంది. నిర్ణీత బరువు కంటే ఏ కొంచెం ఎక్కువున్నా ఉపేక్షించేది లేదు. విభాగానికి తగ్గ బరువు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రెజ్లర్‌దే” అని కాస్ వెల్లడించింది.
ఒలింపిక్స్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్ ఆడలేకపోయిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పేసింది. అనంతరం వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది. అయితే.. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివరకు పతకం ఇవ్వలేమని చెప్పింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది.