పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఇగా స్వియాటెక్ (పోలండ్) తొలి రౌండ్ విజయాలతో టోర్నీలో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన మొదటి రౌండ్ పోటీలలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తు చేసి తదుపరి రౌండ్‌కు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్.. 6-3, 6-4, 6-2తో జెప్పిరి (ఇటలీ)పై అలవోక విజయం సాధించాడు.
గేమ్‌లో 31 విన్నర్లు కొట్టిన నయా స్పెయిన్ బుల్.. 14 సర్వీస్ గేమ్‌లను గెలుచుకుని అరగంటలోనే ఆటను ముగించాడు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్.. 6-3, 6-3తో రెబెక స్రమకోవ (స్లోవేకియా)పై గెలిచింది. వరుస సెట్లలో నెగ్గినా గెలుపు కోసం స్వియాటెక్ గంటా 24 నిమిషాల పాటు చెమటోడ్చక తప్పలేదు. మ్యాచ్‌లో 25 విన్నర్లు కొట్టిన ఈ పోలండ్ అమ్మాయి.. 17 తప్పిదాలు చేసి తడబాటుకు గురైనా మ్యాచ్‌ను కాపాడుకుంది. రెండో రౌండ్లో స్వియాటెక్.. ఇంగ్లండ్ అమ్మాయి ఎమ్మా రడుకానుతో తలపడనుంది.
మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా (జపాన్).. 7-6 (7/1), 1-6, 4-6తో బడోస (స్పెయిన్) చేతిలో ఓడి మరోసారి తొలిరౌండ్‌కే ఇంటిబాట పట్టింది. రడుకాను, రిబాకినా (కజకిస్థాన్), కొలిన్స్ (అమెరికా) తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించారు. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), బెన్ షెల్టన్ (అమెరికా), సిట్సిపస్ (గ్రీస్) రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్)కు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది.