Transgender Cricketer : క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న గేమ్. ఇప్పటివరకూ ఈ ఆటలో పురుషులు, మహిళలు మాత్రమే చూశాం. ఇకపై ట్రాన్స్జెండర్లు(Transgenders) కూడా క్రికెట్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అవును.. కెనడాకు చెందిన డేనియెల్లె మెక్‌గహే(Danielle McGahey) త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనుంది. దాంతో, తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్(First Transgender Cricketer)గా ఆమె గుర్తింపు చరిత్ర సృష్టించనుంది. ఓపెనింగ్ బ్యాటర్ అయిన డేనియెల్లె వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ స్క్వాడ్(2024 Women’s T20 World Cup Qualifying Squad)లో చోటు దక్కించుకుంది.
ఐసీసీ(ICC) నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో కెనడా సెలెక్టర్లు డేనియెల్లేను సెలెక్ట్ చేశారు. క్వాలిఫయింగ్ టోర్నమెంట్ సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు లాస్ ఏంజెల్స్(Los Angeles)లో జరుగనుంది. ‘నేను క్రికెటర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు మా కమ్యూనిటీ తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నా. అందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఉంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవల్స్(testosterone levels) కోసం రెండేళ్లుగా నెలకు ఓసారి రక్త పరీక్షలు చేయించుకుంటున్నా.
డేనియెల్లె మెక్‌గహే
అంతేకాదు నేను ఎవరి బౌలింగ్‌లో ఆడాను, ఎన్ని రన్స్ చేశాను అనే వివరాలు కూడా ఐసీసీకి ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నా. అయితే.. నాకు ఎదురవుతున్న పెద్ద సమస్య రక్తపరీక్ష చేసుకోవడం. ఎందుకంటే క్రికెటర్ అయినందుకు మ్యాచ్‌ల కోసం తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది అని 29 ఏళ్ల డేనియెల్లే ఓ ప్రకటనలో తెలిపింది.
డేనియెల్లె 2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వచ్చింది. అప్పటివరకూ పురుషుడిగా ఉన్న ఆమె మహిళగా మారాలనుకుంది. అందుకని 2021 మేలో వైద్యులను కలిసి తన శరీరంలో తగు మార్పులు చేయించుకుంది. ఆ తర్వాత క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఓపెనర్‌గా రాణిస్తున్న డేనియెల్లె నిరుడు అక్టోబర్‌లో దక్షిణ అమెరికా దేశాలు తలపడిన 4 టీ20ల సిరీస్‌కు ఎంపికైంది. అయితే.. ఆ పోటీలకు అంతర్జాతీయ గుర్తింపు లేదు. దాంతో, డేనియెల్లె టీ20 వరల్డ్ కప్ మీద దృష్టి పెట్టింది.