కోల్‌కతా: టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ(Mohammed Shami)కి.. కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భార్య హసిన్ జహాన్‌తో పాటు కూతురికి ప్రతి నెలా నాలుగు లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మెయింటేనెన్స్లో భాగంగా ఆ అమౌంట్ ఇవ్వాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. భార్యకు నెలా 1.5 లక్షలు, కూతురుకు 2.5 లక్షలు ఇవ్వాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
హసిన్ జహాన్ కోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రతి నెలా నాలుగు లక్షల మెయింటేనెన్స్ ఇవ్వడం వల్ల వాళ్లకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. జూలై ఒకటో తేదీన ఈ తీర్పు వెల్లడైంది. తాము ఇచ్చిన ఆదేశాలతో పాటు కూతురు చదువు కోసం లేదా ఇతర ఖర్చుల కోసం షమీ డబ్బులు ఇవ్వవచ్చు అని కూడా కోర్టు తెలిపింది.
2023లో ఇదే కేసులో జిల్లా సెషన్స్ కోర్టును జహాన్ ఆశ్రయించింది. భార్యకు 50వేలు, కూతురికి 80 వేలు ఇవ్వాలని సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును జహాన్ ఆశ్రయించింది. ప్రతి నెలా తనకు ఏడు లక్షలు, కూతురికి మూడు లక్షలు ఇవ్వాలని జహాన్ కోర్టులో పిటీషన్ వేసింది.
హసిన్ జహాన్‌ను 2014లో షమీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమె మోడల్‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్ చీర్‌లీడర్‌గా చేసింది. 2015లో ఆ జంటకు కూతురు పుట్టింది. షమీ గృహహింసకు పాల్పడుతున్నట్లు 2018లో ఆమె కేసు పెట్టింది. వరకట్న వేధింపుల కేసు కూడా దాఖలు చేసిందామె. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. పాకిస్థానీ మహిళ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆమె తన పిటీషన్లో పేర్కొన్నది. తన భర్త మెయింటేనెన్స్ ఖర్చులు ఇవ్వడం లేదని జహాన్ తన ఫిర్యాదులో ఆరోపించింది.