Test Cricket | దుబాయ్: టెస్టు క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టెస్టులలో రెండంచెల (టూ టైర్) విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి బోర్డులుగా వెలుగొందుతున్న బీసీసీఐ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక ‘ది ఏజ్’లో కథనం ప్రచురితమైంది. ఇదే విషయమై ఐసీసీ చైర్మన్ జై షా త్వరలోనే సీఏ చీఫ్ మైక్ బేయిర్డ్తో పాటు ఈసీబీ అధ్యక్షుడు రిచర్డ్ థాంప్సన్ చర్చించనున్నట్టు సమాచారం.
ప్రస్తుత ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) 2027 ముగిసిన వెంటనే టెస్టులలో రెండంచెల విధానాన్ని అమలుచేయాలని యోచిస్తున్నట్టు వినికిడి. మెల్బోర్న్ టెస్టుకు ప్రేక్షకులు పోటెత్తిన తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి సైతం ఈ విధానాన్ని అమలు చేయాలని నొక్కిచెప్పాడు. దీని ప్రకారం టెస్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరగాలి. చిన్న జైట్లెన జింబాబ్వే, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి టీమ్‌లు తమలో తాము తలపడుతూ.. ఈ గ్రూప్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే జట్టుకు టైర్-1 విభాగంలో చోటు కల్పించాలి. కాగా గతంలోనే ఈ ప్రతిపాదనలు రాగా బీసీసీఐ దీనిని నాడు వ్యతిరేకించింది. దీనివల్ల చిన్న జట్లు తమ ఆదాయాన్ని గణనీయంగా కోల్పోతాయని, అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లు తప్ప మిగతావి ఎవరు చూస్తారని నాడు వాదించింది.