IPL 2023 : ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) భారీ స్కోర్ చేసింది. కీలక బ్యాటర్లు చలెరేగడంతో ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముందు 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఏకంగా ముగ్గురు హాఫ్ సెంచరీలు బాదారు. జోస్ బట్లర్(54), యశస్వీ జైస్వాల్ (54), కెప్టెన్ సంజూ శాంసన్(55) హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆఖర్లో షిమ్రాన్ హెట్మెయిర్(22)దంచి కొట్టడంతో ఆ జట్టు రెండొందలు చేయగలిగింది. ఫారుఖీ వేసిన 20వ ఓవర్లో హెట్మెయిర్ ఫోర్ కొట్టి స్కోర్ రెండొందలు దాటించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారుఖీ, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్‌కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ (54) శుభారంభం ఇచ్చారు.మొదటి వికెట్‌కు 85 రన్స్ జోడించారు. ముఖ్యంగా బట్లర్ వీరవిహారం చేశాడు.7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఔటయ్యాక స్కోర్ వేగం తగ్గింది. ఆదిల్ రషీద్, సుందర్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో యశస్వీ, శాంసన్ ఆచితూచి ఆడారు. వీళ్లు రెండో వికెట్ 54 రన్స్ జోడించారు. 139 వద్ద రెండో వికెట్. యశస్వీ జైస్వాల్ (54)ను ఔట్ చేసి ఫజల్హక్ ఫారుఖీ హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ సిక్స్‌లతో చెలరేగాడు. నటరాజన్ వేసిన 19వ ఓవర్లో బౌండరీ వద్ద అభిషేక్ శర్మ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతడు వెనుదిరిగాడు. ఆఖర్లో హెట్మెయిర్ 16 బంతుల్లో 22 రన్స్ చేయడంతో రాజస్థాన్ స్కోర్ రెండొందలు దాటింది.