ENG VS IND Test | ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు భారీ ఉపశమనం లభించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ధ్రువీకరించారు. అయితే, అతనిపై టీమ్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్-భారత్ రెండో టెస్టు జులై 2 నుంచి మొదలుకానున్నది.
ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ధ్రువీకరించాడు. ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంపై చర్చనీయాంశంగా మారింది. కానీ, బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని మ్యాచ్‌కు ముందు డోస్చేట్ బుమ్రా ఆడుతాడని ధ్రువీకరించడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. వాస్తవానికి రెండోటెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తొలి టెస్టును ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ తొలి టెస్టులో రాణించకపోవడంతో బర్మింగ్‌హామ్ టెస్టుకు బుమ్రా ఆడడం కీలకంగా మారింది. రెండోటెస్టుకు ముందు డోస్చేట్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. బుమ్రా ఎడ్జ్ బాస్టన్ టెస్టు ఆడుతాడని ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని తెలిపారు. ఐదు టెస్టుల్లో మూడు టెస్టులు ఆడతాడని మాత్రమే మొదటి నుంచి తెలుసునని.. చివరి టెస్ట్ నుంచి బుమ్రాకు ఎనిమిది రోజుల విశ్రాంతి దొరికిందని చెప్పారు. అయితే, పనిభారం చూస్తే మిగతా మ్యాచుల్లో బుమ్రా ఎలా ఆడగలడో చూడాలని.. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డోస్చేట్ పేర్కొన్నారు.
వాస్తవానికి, టీమిండియా బౌలింగ్ భారం మొత్తం బుమ్రాపైనే పడుతున్నది. తొలి టెస్టులో బుమ్రా ఏకంగా 43.4 ఓవర్లు వేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 24.4, రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ తీయలేకపోయాడు. అయితే, బుమ్రాకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించడం లేదు. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో బౌలింగ్ భారం బుమ్రాపైనే పడుతున్నది. బుమ్రా మూడు మ్యాచులు ఆడితే.. మిగతా రెండు టెస్టుల్లో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.