మహాబలిపురం : సర్ఫింగ్‌లో కొత్త కెరటం దూసుకొచ్చింది. దేశంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న సర్ఫింగ్‌లో రమేశ్ బుదిహాల్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. సర్ఫింగ్‌ను ఊపిరిగా చేసుకుంటూ బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతున్నాడు. ప్రతిష్టాత్మక ఏషియన్ సర్ఫింగ్ చాంపియన్‌షిప్(ఏఎస్సీ) ఫైనల్ చేరిన తొలి భారత సర్ఫర్‌గా రమేశ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. కోవలం బీచ్‌లో మొదలైన రమేశ్ సర్ఫింగ్ శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టే స్థితికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఏషియన్ సర్ఫింగ్ టోర్నీలో రమేశ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.
ఇండోనేషియాకు చెందిన సర్ఫర్ పజార్ అరియాన (13.83)కు దీటైన సవాలు విసురుతూ వరుస రైడ్లలో రమేశ్ 5.50, 5.93 పా యింట్లతో దక్కించుకుని 11.43తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో షిడాంగ్ వు (9.03, చైనా), కిశోర్‌కుమార్ (8.10)ను అధిగమిస్తూ తుదిపోరులో నిలిచాడు. కోవలం బీచ్‌లో మొదలైన రమేశ్ సర్ఫింగ్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగింది. కోవలం సర్ఫింగ్ క్లబ్ ద్వారా ఇందులోకి ప్రవేశించిన రమేశ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.