NZW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. తొలిపోరులో ఇంగ్లండ్‌పై 69కే ఆలౌట్ అయిన ఆ జట్టు న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. తంజిమ్ బ్రిస్త్ (101) విధ్వంసక సెంచరీతో చెలరేగగా.. సునే లుస్(83 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. బ్రిస్త్ ఔటయ్యాక స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు పడినా.. ప్రత్యర్థికి లుస్ అవకాశం ఇవ్వలేదు. సినాలో జఫ్తా(6 నాటౌట్) అండగా సునే చివరిదాకా నిలబడగా 6 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. అన్ని విభాగాల్లోనూ తేలిపోయిన వైట్ ఫెర్న్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.
వరల్డ్ కప్‌ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా ఫీనిక్స్ పక్షిలా దూసుకొచ్చింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 69కే కుప్పకూలిన ఆ జట్టు సంచలన ఆటతో న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించింది. మొదట కివీస్‌ను భారీ స్కోర్ చేయకుండా బౌలర్లు అడ్డుకుంటే.. తన విధ్వంసక ఆటతో లక్ష్యాన్ని కరిగించింది తంజిమ్ బ్రిస్త్(101). వైట్ ఫెర్న్స్ నిర్దేశించిన 232 పరుగుల ఛేదనలో ఈ ఓపెనర్ రెచ్చిపోయి ఆడింది. ఓపెనర్ లారా వొల్వార్డ్త్ (14) నిరాశపరిచినా.. తంజిమ్ మాత్రం అపరకాళిలా చెలరేగిపోయింది.
Brits, Luus and Mlaba help South Africa bounce back from their opening defeat with a comfortable victory against New Zealand 💪
Scorecard: https://t.co/pOiRkp1l9R pic.twitter.com/XXglGUU3na
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన తను బౌండరీల మోతతో అలరిస్తూ స్కోర్ బోర్డును ఉరికించింది. సునే లుస్(83 నాటౌట్)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి.. న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఊచకోతను తలపించే ఇన్నింగ్స్ ఆడిన తంజిమ్ 87 బంతుల్లోనే సెంచరీకి చేరువైంది. వన్డేల్లో ఆమె మూడంకెల స్కోర్ సాధించడం ఇది ఎనిమిదోసారికాగా ఈ క్యాలండర్ ఇయర్లో ఐదోసారి.
శతకంతో సఫారీలను గెలుపు వాకిట నిలిపిన తంజిమ్ చివరకు తుహువ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయింది. అప్పటికీ స్కోర్.. 185/2. విజయానికి 47 రన్స్ కావాల్సిన దశలో రెండు వికెట్లు పడ్డాయి. మరినే కాప్, బాస్చ్ వెనుదిరగగా.. సునే మాత్రం పట్టువదల్లేదు. కేర్ వేసిన 39వ ఓవర్లో రెండు ఫోర్లు బాదింది. ఆ తర్వాత సినాలో జఫ్తా(6 నాటౌట్) దూకుడుగా ఆడిం. కార్సన్ వేసిన 41వ ఓవర్లో డబుల్స్ తీసిన సనే జట్టుకు 6 వికెట్ల విజయాన్ని కట్టబెట్టింది.
Tazmin Brits breaks Meg Lanning’s record – the fastest to seven centuries in women’s ODIs 🔥 pic.twitter.com/81wiH2fni2
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు మొదటి ఓవర్లోనే పెద్ద షాకిచ్చింది మరనే కాప్. ఓపెనర్ సుజీ బేట్స్ (0)ను గోల్డెన్ డక్‌గా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. ఆ తర్వాత జార్జియా పిమ్మర్(31), ఆల్‌రౌండర్ అమేలియా కేర్(23)లు ఆచితూడి ఆడి.. రెండో వికెట్‌కు 44 రన్స్ జోడించారు. కానీ..పవర్ ప్లే తర్వాత చొలే ట్రయాన్ బౌలింగ్‌లో అమేలియా ఔట్ అయింది. అనంతరం పిమ్మర్, కెప్టెన్ సోఫీ డెవినె(85) దూకుడుగా ఆడి జట్టు స్కోర్ సెంచరీ దాటించారు. కాసేపటికే పిమ్మర్ వెనుదిరిగిన బ్రూక్ హల్లిడే(45) సాయంతో డెవినె చెలరేగింది. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. దాంతో.. 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 164 చేసిన వైట్ ఫెర్న్స్ అలవోకగా 270 మార్క్ అందుకుంటుందనిపించింది.
New Zealand lose 7 for 44 after an 86-run partnership between Sophie Devine and Brooke Halliday – can they defend 231 against South Africa?
LIVE: https://t.co/pOiRkp0Nkj | #CWC25 pic.twitter.com/LAH6hf30qV
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2025
డెవినె, హల్లిడేల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగుతున్న న్యూజిలాండ్‌ను మలబ దెబ్బకొట్టింది. మరినే కాప్ ఓవర్లో ఆమె సూపర్ త్రోతో హల్లిడేను రనౌట్ చేసింది. అప్పటివరకూ 187/3తో పటిష్ట స్థితిలో ఉన్న న్యూజిలాండ్ పతనం మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ డెవినెను క్లీన్ బౌల్డ్ చేసింది. అంతే.. అక్కడి నుంచి సఫారీల జోరు కొనసాగగా కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు డగౌట్ చేరారు. దాంతో.. పూర్తి ఓవర్లు ఆడకుండానే 47.5 ఓవర్లకే వైట్ ఫెర్న్స్ ఇన్నింగ్స్ ముగిసింది. డెవినె వికెట్‌తో పుంజుకున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థిని 231కే ఆలౌట్ చేసింది.