లండన్: ప్రపంచాన్ని జయించిన ప్రతీ చాంపియన్ వెనుక ఓ కన్నీటి గాథ దాగుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడి సోమాలియా.. ఎక్కడి బ్రిటన్. అంతర్యుద్ధంతో బ్రతికి బట్టకట్టడమే గగనమైన రోజుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశ సరిహద్దులు దాటిన ఒక అనామక బాలుడు ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇది జరిగింది. చరిత్ర చెబుతున్న సాక్షమిది. అవును ఊహ తెలియని వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన బ్రిటన్ దిగ్గజ స్ప్రింటర్ మోఫరా కన్నీటి గాథ ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. తొమ్మిదేండ్ల వయసులో సోమాలియా నుంచి ఒక మహిళ సాయంతో అక్రమ రవాణాతో బ్రిటన్‌కు చేరుకున్న మోఫరా పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. తన కుటుంబసభ్యులను కల్పిస్తానన్న మహిళ మాటలను నమ్మి మోసపోయిన మోఫరా అథ్లెటిక్స్‌లో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. పరుగునే ప్రాణంగా ప్రేమిస్తూ విశ్వక్రీడల్లో నాలుగు పసిడి పతకాలు గెలిచిన తొలి బ్రిటన్ పౌరుడిగా చరిత్రకెక్కాడు. జీవితంలో తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులతోబీబీసీ ‘ద రియల్ మో ఫరా’ పేరుతో టీవీ డాక్యుమెంటరీని రూపొంచింది. ఇది బుధవారం ప్రసారం కాబోతున్నది. ఇందులో మో ఫరాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానున్నాయి.