Brett Lee : అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు.. ముఖ్యంగా బౌలర్లు తరచూ గాయపడడం మామూలే. కానీ, వయసు పైబడుతున్నా సరే కొందరు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వంటి కొందరు మాత్రం తమ ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అసలు వీళ్లు ఒక్కసారైనా గాయపడరా? అనే సందేహాన్ని రేకెత్తిస్తుంటారు. ఈ మధ్యే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో జడేజా గొప్పగా రాణించాడు. ముఖ్యంగా బ్యాటుతో, బంతితో చెలరేగిన జడ్డూ ఆటకు ఫిదా అయిపోయిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ (Brett Lee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ ప్రదర్శనతో సిరీస్ సమం చేసింది. మాంచెస్టర్ టెస్టులో అజేయ శతకంతో జట్టును గట్టెక్కించిన జడేజా.. ఓవరాల్‌గా ఐదు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అతడు అర్ధ శతకం బాదిన ప్రతిసారి కత్తిసాము (Sword Celebration) విన్యాసం చేశాడు. బ్యాట్‌ను అచ్చం కత్తిని తిప్పినట్టు తిప్పుతూ ఫ్యాన్స్‌ను అలరించాడు. కానీ, బ్యాట్‌ను అలా రప్పారప్పా తిప్పడం వల్లనే జడ్డూ గాయపడే అవకాశముందని బ్రెట్ లీ సరదాగా అన్నాడు.
Another 5️⃣0️⃣ for the Rockstar 🌟
Ravindra Jadeja just can’t stop scoring in England 🤩 #SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/1mPZwOGroS
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2025
‘జడేజా ఎప్పుడూ ఫిట్నెస్తో ఉంటాడు. నేను చూసిన గొప్ప ఆల్రౌండర్లలో అతడు ఒకడు. అయితే.. అతడు గాయపడేందుకు అవకాశముంది. అదేంటంటే.. అతడి సెలబ్రేషన్ స్టయిల్. అవును.. హాఫ్ సెంచరీ లేదా సెంచరీ బాదినప్పుడల్లా జడ్డూ బ్యాట్‌ను కత్తిలా తిప్పుతాడు. అలా చేయడం వల్ల రొటేటరీ కఫ్ ఇంజూరీ (Rotator Cuff Injury) బారిన పడే ఆస్కారముంద’ని పేస్ లెజెండ్ జోక్ చేశాడు.
అంతేకాదు జడేజా వంద టెస్టులు ఆడాలని కోరుకుంటున్నానని బ్రెట్ లీ తెలిపాడు. ‘ప్రస్తుతం అతడికి 36 ఏళ్లు. అయినా సరే ఎంతో ఫిట్‌గా కనిపిస్తాడు. కాబట్టి మరో రెండేళ్లు ఆడడం అతడికి పెద్ద ఇబ్బందిగా అనిపించదు జడ్డూ ఇంకో రెండేళ్లలో మరో 15 టెస్టులు ఆడతాడని భావిస్తున్నా. దాంతో అతడు వంద టెస్టులు పూర్తి చేసుకుంటాడు’ అని ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో 86 సగటుతో 516 పరుగులు సాధించాడీ ఆల్‌రౌండర్. బంతితోనూ సత్తా చాటి ఏడు వికెట్లు తీశాడు.