మియామి గార్డెన్స్: ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ నాకౌట్లోకి దూసుకెళ్లింది. టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన బ్రెజిల్ మెగాటోర్నీలో తమదైన జోరు కొనసాగిస్తున్నది. ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచకప్ టోర్నీని ముద్దాడిన సాంబా టీమ్.. రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌పై కన్నేసింది. గురువారం జరిగిన గ్రూపు-సీ లీగ్ పోరులో బ్రెజిల్ 3-0 తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన బ్రెజిల్ రౌండ్-32కు అర్హత సాధించింది. ఇదే గ్రూపు నుంచి మొరాకో నాకౌట్ బెర్తు దక్కించుకుంది. మ్యాచ్ విషయానికొస్తే వినిసియస్ జూనియర్(7ని, 45+3ని) డబుల్ గోల్స్‌తో విజృంభించగా, మథియస్ కున్హా(60ని) బ్రెజిల్‌కు గోల్స్ అందించి ఆ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. గాయం కారణంగా గత మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ైస్ట్రెకర్ నెయ్మర్ జూనియర్.. స్కాట్లాండ్తో పోరులో బరిలోకి దిగాడు.
మ్యాచ్ మొదలైన 7వ నిమిషంలోనే వినిసియస్ గోల్‌తో సాంబా టీమ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్కాట్లాండ్ డిఫెన్స్ లోపాలను ఎత్తిచూపుతూ వినిసియస్ గోల్ కొట్టాడు. 54 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న బ్రెజిల్.. పదేపదే స్కాట్లాండ్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో ప్రథమార్ధం అదనపు సమయంలో వినిసియస్ మరో గోల్‌తో ఆధిక్యం 2-0కు చేరుకుంది. మెగాటోర్నీలో ఈ యువ ైస్ట్రెకర్కు ఇది మూడో గోల్. ప్రతిదాడులు చేసేందుకు స్కాట్లాండ్ ప్రయత్నించినా.. పటిష్టమైన బ్రెజిల్ డిఫెన్స్ ముందు ఆ జట్టు ఆటలు సాగలేదు. 60వ నిమిషయంలో మథియస్ గోల్‌తో బ్రెజిల్ తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. 1998 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న స్కాట్లాండ్, నాకౌట్ దశకు చేరుకుండానే నిష్ర్కమించింది. తమ జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది తరలిరావడంతో బోస్టన్, మియామి ప్రాంతాలు కొత్త కళను సంతరించుకున్నాయి.

ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య దేశాలైన మెక్సికో, కెనడా ముందంజ వేశాయి. గ్రూపు-సీలో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 3-0తో అద్భుత విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మెక్సికో నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. దాదాపు 85వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరైన ఈ పోరులో మెక్సికో తరఫున మతియో చావెజ్(55ని), జులియన్ క్యుఫినోస్(61ని), అల్వెరో(90+4ని) గోల్స్ చేశారు. ఇదిలా ఉంటే మెక్సికో దిగ్గజ గోల్‌కీపర్ గులెర్మో ఒచోవా ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌కు ముగింపు పలికాడు. తన ఆరో ప్రపంచకప్ ప్రాతినిధ్యం ద్వారా దిగ్గజ ప్లేయర్లు రొనాల్డో, మెస్సీ సరసన నిలిచిన 40 ఏండ్ల గులెర్మోకు అభిమానులు ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. మరోవైపు గ్రూపు-బీలో స్విట్జర్లాండ్ 2-1తో కెనడాపై గెలిచింది. స్విస్ తరఫున రుబెన్ వర్గస్(46ని), జోహన్ మజాంబి(57ని) గోల్స్ చేశారు.

సఫారీలు అదరగొట్టారు. గెలిస్తే గానీ టోర్నీలో నిలువలేని పరిస్థితుల మధ్య ఆఖరి పోరులో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 1-0తో దక్షిణకొరియాపై అద్భుత విజయం సాధించింది. తద్వారా గ్రూపు-ఏ నుంచి మెక్సికోతో పాటు సఫారీ జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. మ్యాచ్ 63వ నిమిషంలో తపెలో మసెకో కండ్లు చెదిరే గోల్‌తో ఆ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. నాకౌట్లో సౌతాఫ్రికా కెనడాతో తలపడనుంది.
సరిగ్గా 52 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్న కరీబియన్ దేశం హైతీ.. తమ చివరి పోరులో ఆకట్టుకుంది. మొరాకోతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 2-4తో ఓడిన హైతీ పోరాట పటిమ ప్రదర్శించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన హైతీ తొలిసారి మెగాటోర్నీలో గోల్ చేసి సత్తాచాటింది. విల్సన్(43ని).. ఏకైక గోల్ చేయగా, మొరాకో గోల్‌కీపర్ యాసిన్ ఓన్ గోల్ ద్వారా హైతీకి గోల్ దక్కింది.
