భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియాకు ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రూపంలో పెద్ద సవాలు ఎదురుకాబోతున్నది. పెర్త్‌లో మొదలయ్యే తొలి టెస్టు కోసం అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నది. రోహిత్ గైర్హాజరీలో బుమ్రా కెప్టెన్సీ ఖరారు కాగా, ఓపెనర్ రాహుల్, మూడో నంబర్లో పడిక్కల్, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌రెడ్డి, మిడిలార్డర్లో జురెల్, సర్ఫరాజ్ మధ్య పోటీ ఏర్పడింది. తొలి టెస్టుకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు నడుస్తున్నది.
పెర్త్: గత రెండు పర్యాయాలు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి చారిత్రక విజయాలు సొంతం చేసుకున్న భారత్ ఈసారి దీటైన పోటీని ఎదుర్కొనే అవకాశముంది. గతానికి పూర్తి భిన్నంగా ఈసారి కంగారూ జట్టు..టీమ్ఇండియాకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఎలా ఎదుర్కొవాలనే దానిపై టీమ్ఇండియా మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు కోసం తుది జట్టు ఎంపికపై దృష్టి సారించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ స్వదేశంలోనే ఉండిపోగా, ప్రాక్టీస్ మ్యాచ్లోగిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జైస్వాల్‌కు జతగా రాహుల్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్‌లో గాయపడి తేరుకున్న రాహుల్..పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తున్నది. మంగళవారం నెట్స్‌లో డిఫెన్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన రాహుల్..జైస్వాల్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో ఓపెనింగ్‌కు వచ్చిన అనుభవంతో రాహుల్ వైపు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు సిరీస్‌కు సన్నాహకంగా ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టుల్లో మెరుగ్గా రాణించిన పడిక్కల్‌ను మూడో నంబర్లో దింపే చాన్స్ కనిపిస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో పడిక్కల్ చాలాసేపు గడపడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
ఇప్పటికే పొట్టి ఫార్మాట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి.. పెర్త్ టెస్టు ద్వారా టెస్టు టీమ్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ ఎంపికైతే జట్టుకు లాభించే అవకాశముంది. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు తోడు ఉపయుక్తమైన పేస్ బౌలర్‌గా నితీశ్ సేవలు జట్టుకు బాగా లాభించనున్నాయి. బౌలింగ్ కోచ్ మోర్కెల్ పర్యవేక్షణలో నితీశ్ నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. అతని బౌలింగ్ లైనప్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన మోర్కెల్ సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. తనకు జోడీగా బుమ్రా పేస్ బౌలర్లలో ఎవరిని ఎంచుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ఎవరు తుది జట్టులోకి వచ్చేది చూడాలి. మిడిలార్డర్లో జురెల్, సర్ఫరాజ్ మధ్య పోటీ ఏర్పడింది.