ODI World Cup 2023 | మరో పదిహేను రోజుల్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోరుగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే బిగ్‌బి అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్ అందించిన బోర్డు.. సొంతగడ్డపై జరుగనున్న మెగాటోర్నీకి సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్‌ను విశిష్ట అతిథిగా ఎంపిక చేసింది. దీంతో పాటు టోర్నీలో ఏ మ్యాచ్‌కైనా వీక్షించే విధంగా తలైవాకు గోల్డెన్ టికెట్ కేటాయించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా.. రజినీకాంత్‌కు గోల్డెన్ టికెట్ అందిస్తున్న ఫొటోనూ ట్విట్టర్లో పంచుకుంది.
‘సినీ జగత్తులోనే కాకుండా.. గ్రేస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా గోల్డెన్ టికెట్ అందించారు. భాషా, ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సొంతం చేసుకున్న రజినీకాంత్‌కు గోల్డెన్ టికెట్ అందించడాన్ని గర్విస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు రజినీకాంత్‌ను విశిష్ట అతిథిగా ఎంపిక చేసినట్లు పేర్కొంది. ‘ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023కు తలైవా మా విశిష్ట అతిథిగా ఉండనున్నారు. ఆయన రాకతో ఈ క్రికెట్ పండుగ మరింత మందికి చెరువవుతుందని ఆశిస్తున్నాం’ అని ట్విట్టర్లో వెల్లడించింది. వచ్చే నెల 5న వరల్డ్‌కప్ ప్రారంభం కానుండగా.. గత ఎడిషన్ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి పోరు జరుగనుంది. మెగాటోర్నీలో భాగంగా టీమ్ఇండియా తొలి పోరులో అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.