Match Fixing : ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) వార్తలు కలకలం రేపుతున్నాయి. కెనడా క్రికెట్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తీగ లాగడంతో డొంక కదులుతోంది. ఐసీసీని, క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఎపిసోడ్లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawerence Bishnoi) హస్తం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. మెగా టోర్నీలో కెనడా జట్టు కూర్పును బిష్ణోయ్ గ్యాంగ్ ప్రభావితం చేసిందని సీబీసీ వార్త సంస్థ నివేదిక వెల్లడించింది.
ఈమధ్యే భారత్, శ్రీలంక వేదికగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కుంభకోణంలో కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని తెలిసింది. దిల్‌ప్రిత్ బజ్వా(Dilpreet Bajwa)ను కెప్టెన్‌గా నియమించడం నుంచి అతడికి అందరూ మద్దుతగా నిలవాలని, కొందరు ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టొద్దని బిష్ణోయ్ బృందం సెలెక్టర్లను బెదిరించింది. ఒకవేళ ఎవరైనా బజ్వా మాట వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని సీబీసీ వార్త సంస్థ వెల్లడించింది.
🚨 MATCH FIXING ALLEGATIONS | NZ vs Canada T20 WC (Match 31)
The ICC’s Anti-Corruption Unit has launched a formal probe into the Group Stage clash played on Feb 17 in Chennai.
A specific over bowled by Canada captain Dilpreet Bajwa starting with a no-ball, then a wide,… pic.twitter.com/j3VCx3GIub
— Bharat Briefs (@Bharatbriefshq) April 17, 2026
చెన్నై వేదికగా కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్ సమయంలో అవినీతి నిరోధక నియమావళి ఉల్లంఘన జరిగడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి దృష్టి సారించింది. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోబుతున్నారు? అని ఐసీసీని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి మేము ఫిక్సింగ్, అవినీతి ఆరోపణలపై కామెంట్ చేయాలనుకోవడం లేదు అని ఐసీసీ మధ్యంతర అధ్యక్షుడు ఆండ్రూ ఫాగ్రవె తెలిపాడు.
క్రికెట్ కెనడాలో పనితీరు లోపాలను, జట్టు ఎంపిక, మ్యాచ్ ఫిక్సింగ్‌కు అవకాశముందనే అంశాలను తాజాగా ఓ డాక్యుమెంటరీ హైలెట్ చేసింది. ఇందుకు ఉదాహారణగా కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌ను పేర్కొంది. ప్రత్యర్ధికి 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కెనడా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని, కెప్టెన్ బజ్వా వేసిన ఓవర్లో నో బాల్, వైడ్ కలిపి 15 పరుగులివ్వడం ఫిక్సింగ్ అనుమానాలు రేకెత్తిస్తోందని డాక్యుమెంటరీ స్పష్టం చేసింది. అంతేకాదు కోచ్ ఖుర్రమ్ చోహన్ ఫోన్ రికార్డింగ్ లీకవ్వడం కూడా అవినీతి జరిగింది అనడానికి బలం చేకూరుస్తోంది.
జట్టు ఎంపిక సమయంలో బోర్డు సభ్యులు తనపై ఒత్తిడి పెంచారని ఖుర్రం వెల్లడించాడు. కెనడా క్రికెట్లో ఇవేమీ కొత్తకాదని మాజీ కోచ్ ఒకానొక సందర్భంలో చెప్పాడు. దాంతో, ఫిక్సింగ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం గురించి విచారణ జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.