TVK chief Vijay : తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) కి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) ఆహ్వానం పంపారు. ఈ మేరకు ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను తమిళనాడు లోక్‌భవన్ (Tamil Nadu Lok Bhavan) విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలవనున్నారు.
ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) విజయ్‌కి దక్కలేదు. సొంతంగా 107 స్థానాలు గెలిచిన టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు గవర్నర్ అర్లేకర్‌కు టీవీకే చీఫ్ లేఖ రాశారు.
తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు రెండు వారాల గడువు కావాలని కోరారు. ఈ క్రమంలో విజయ్‌ని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇదిలావుంటే మెజార్టీ మార్క్‌కు 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే లేఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు పూర్తి మద్దతిస్తామని ప్రకటించింది. విజయ్ తమ మద్దతు కోరారని.. దానిపై సీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పని చేస్తామని కాంగ్రెస్ తన లేఖలో వెల్లడించింది.