Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల సందడి మొదలైంది. ఈ పోటీల్లో మెడల్ కొట్టేందుకు పలు దేశాల అథ్లెట్లు, క్రీడాకారులు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈ విశ్వ క్రీడల్లో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్(Bill Gates) అల్లుడు సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
బిల్ గేట్స్ పెద్ద కూతురు జెన్నిఫర్ గేట్స్(Jennifer Gates) భర్త అయిన నయెల్ నసిర్(Nayel Nassar) ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్(Equestrian) విభాగంలో బరిలోకి దిగుతున్నాడు. గుర్రపు స్వారీలో రాటుదేలిన 33 ఏండ్ల నయెల్ ఈజిప్ట్ తరఫున పోటీ పడుతున్నాడు.
జెన్నిఫర్ గేట్స్‌ను నయెల్ 2021 అక్టోబర్‌లో పెండ్లి చేసుకున్నాడు. ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతోంది. పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన భర్త విజయాన్ని ఆకాంక్షిస్తూ జెన్నిఫర్ గేట్స్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నీకు మద్దతుగా మేమున్నాం’ అంటూ జెన్నిఫర్ క్యాప్షన్ రాసింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ నయెల్ పాల్గొన్నాడు.