కోల్‌కతా: అసలే తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతున్న భారత ఫుట్‌బాల్ రంగానికి మరో దెబ్బ. దేశ దిగ్గజ ఫుట్‌బాల్ క్లబ్ అయిన మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌కు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) షాకిచ్చింది. 2025-26 ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్ 2లో భాగంగా ఇరాన్‌తో మ్యాచ్ ఆడకుండా విరమించుకున్నందుకు గాను ఆ జట్టుపై ఏడాదిపాటు నిషేధం విధించింది. బ్యాన్‌తో పాటు రూ. 91 లక్షల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్‌లో మోహన్ బగాన్.. ఇరాన్‌కు చెందిన సెపహాన్తో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో తాము ఇరాన్‌కు వెళ్లబోమని (ఆ జట్టుకు చెందిన ఆరుగురు ఆటగాళ్లకు ఇరాన్‌కు వెళ్లలేమని తేల్చి చెప్పడంతో) నిశ్చయించుకుంది. దీనిపై సెపహాన్ ఫిర్యాదుతో ఏఎఫ్సీ చర్యలకు ఉపక్రమించింది. అంతేగాక ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 ఫైనల్ రౌండ్ క్వాలిఫయర్స్‌ను నిర్ణీత సమయంలో నిర్వహించనందుకు గాను ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) పైనా రూ. 90 వేల జరిమానా విధించింది.