హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్(జేబీసీ) 8వ ఎడిషన్‌లో భవేశ్రెడ్డి సింగిల్స్ విజేతగా నిలిచాడు. శనివారంతో ముగిసిన టోర్నీలో బాలుర అండర్-13 సింగిల్స్ ఫైనల్లో భవేశ్ 15-13, 15-4తో గోయల్ దర్శ్పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన భవేశ్..ప్రత్యర్థిని వరుస గేముల్లో చిత్తుచేశాడు. మిగతా విభాగాల్లో శ్రీరామ్, సానియాశర్మ(అండర్-11), దశురి(అండర్-13), శ్రీహర్ష, మాన్య అగర్వాల్ (అండర్-15), అలీ సిద్ధిఖీ, మాన్య అగర్వాల్(అండర్-17) విజేతలుగా నిలిచారు. రైలు నిలయంలో జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి భారత స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాల్లో ఎక్కువ మంది పిల్లలు పోటీపడ్డ టోర్నీగా జేబీసీ వరుసగా మూడోసారి ప్రపంచ రికార్డు సొంతం చేసుకుందని నిర్వహకులు పేర్కొన్నారు.