Paris Olympics | పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత అథ్లెట్లు మెరుగైన ఫలితాలు సాధించి పతకాల వేటలో ముందంజ వేశారు. షూటింగ్ సంచలనం మను భాకర్ ‘డబుల్ మెడల్’ ఇచ్చిన స్ఫూర్తితో బుధవారం మన క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో విజయాలతో సత్తా చాటారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫయర్స్‌లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుశాలె ఏడో స్థానంతో ముగించి గురువారం జరిగే పతక రేసుకు అర్హత సాధించి మరో మెడల్‌పై ఆశలు రేపుతున్నాడు. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్‌లో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ తమ ప్రత్యర్థులను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించగా గత ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ క్వార్టర్స్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఆర్చరీలో దీపికా కుమారి రాణించగా రోయింగ్, ఈక్వెస్ట్రియన్‌లో మన అథ్లెట్లు పతకాలు తేకున్నా ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు.
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు పతక ఆశలు రేపుతున్నవారిలో ముందున్న హైదరాబాదీ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో శ్రీజ 4-2 (9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10)తో జియాన్ జెంగ్ (సింగపూర్)ను ఓడించింది. 51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో వెనుకబడ్డా తర్వాత పుంజుకున్న శ్రీజ వరుసగా మూడు గేమ్‌లు గెలిచింది. ఐదో గేమ్‌ను ప్రత్యర్థి గెలుచుకున్నా చివరి గేమ్‌ను నెగ్గి ఒలింపిక్స్‌లో మనికా బాత్ర తర్వాత ప్రిక్వార్టర్స్‌కు చేరిన రెండో ప్యాడ్లర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ.. చైనా అమ్మాయి, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్ అయిన సున్ యింగ్షాతో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రిక్వార్టర్స్‌లో మనికా 6-11, 9-11, 14-12, 8-11, 6-11తో మియు హిరానో(జపాన్) చేతిలో ఓటమిపాలైంది.
పారిస్: షూటింగ్లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పతకాలు సాధించి జోరుమీదున్న భారత్‌కు ఐదో రోజు ఆశాజనక ఫలితాలు వచ్చాయి. మరో షూటర్ స్వప్నిల్ కుశాలె పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ (3పీ) క్వాలిఫికేషన్ రౌండ్లో 590 (38 షాట్లు) పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో ముగించాడు. తద్వారా అతడు గురువారం జరిగే మెడల్ రేసులోకి వచ్చి భారత్‌కు మరో పతకంపై ఆశలు రేపుతున్నాడు. నీలింగ్ (మోకాళ్ల మీద కూర్చునే) పొజిషన్లో రెండు సిరీస్‌లలో రెండు సార్లూ 99 పాయింట్లు స్కోరు చేసిన స్వప్నిల్.. ప్రోన్ (పడుకుని) పొజిషన్లో 98, 99 పాయింట్లు రాబట్టాడు. స్టాండింగ్ (నిలుచుని)లో 98, 97 స్కోరు చేసి టాప్-8లో చోటు సంపాదించుకున్నాడు. గురువారం జరిగే పతక పోరులోనూ స్వప్నిల్ సత్తా చాటితే పారిస్‌లో భారత్‌కు మూడో పతకం తెచ్చిన మూడో షూటర్‌గా నిలుస్తాడు. ఇదే ఈవెంట్లో పోటీపడ్డ మరో భారత షూటర్ ఐశ్వర్యప్రతాప్ సింగ్ తోమర్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల ట్రాప్ షూటింగ్ క్వాలిఫికేషన్లో భారత అమ్మాయిలు రాజేశ్వరి కుమారి (22వ స్థానం), శ్రేయాసి సింగ్ (23) నిరాశపరిచారు.
గత రెండు ఒలింపిక్స్‌లో రజతం, కాంస్యం సాధించి ఈసారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన గ్రూప్-ఎం మహిళల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో సింధు 21-5, 21-10తో క్రిస్టిన్ కూబ (ఇస్తోనియా)ను చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. సింధు జోరు ముందు 73వ ర్యాంకర్ క్రిస్టిన్ ఏమాత్రం నిలవలేకపోయింది. 33 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సింధుకు.. ప్రిక్వార్టర్స్ నుంచి కఠిన ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-18, 21-12తో తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన జొనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)ని మట్టికరిపించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన క్రిస్టీ తొలి గేమ్‌లో సేన్‌కు సవాళ్లు విసిరినా రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయాడు. ఇక మరో పోరులో హెచ్ఎస్ ప్రణయ్.. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 16-21, 21-11, 21-12తో లీ డు ఫట్(వియత్నాం)పై అద్భుత విజయం సాధించాడు. ప్రత్యర్థికి తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్.. ఆ తర్వాత పుంజుకుని వరుస గేముల్లో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నెట్గేమ్కు తోడు స్మాష్‌లు, డ్రాప్షాట్లతో ఆకట్టుకున్న ప్రణయ్..కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.
పారిస్‌లో భారత్ నుంచి ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) పోటీలలో పాల్గొన్న అనూష్ అగర్వాల బుధవారం జరిగిన వ్యక్తిగత డ్రెస్సేజ్ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచి పతక రేసు నుంచి నిష్క్రమించాడు. అనూష్ ఓడినా ఈ క్రీడలో భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. ఇక పురుషుల రోయింగ్‌లో సెమీస్ చేరడంలో విఫలమైన బాల్‌రాజ్ పన్వర్ వర్గీకరణ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. తద్వారా అతడు 19-24 మధ్య ర్యాంకుల కోసం జరిగే పోరుకు అర్హత సాధించాడు.
గత ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అసోం యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ పారిస్‌లోనూ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా 5-0తో సున్నివ హెఫ్స్టడ్ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును దక్కించుకుంది. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన లవ్లీనా.. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ బాక్సర్ లి కియాన్‌తో తలపడనుంది. ఈ పోరులో గెలిచి సెమీస్ చేరితే లవ్లీనా భారత్‌కు మరో పతకం ఖాయం చేసినట్టే. కాగా మరో యువ బాక్సర్ ప్రీతి పన్వర్ పోరాటం ముగిసింది. మహిళల ప్రిక్వార్టర్స్‌లో ప్రీతి 2-3తో యెని మర్కెల (కొలంబియా) చేతిలో పోరాడి ఓడింది.
మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో భారత సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి ప్రిక్వార్టర్స్ చేరింది. బుధవారం వరుసగా రౌండ్ ఆఫ్-32, రౌండ్ ఆఫ్ 16 ఎలిమినేషన్ మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. తొలి మ్యాచ్‌లో దీపికా 6-5తో రీనా పర్ణత్ (ఇస్తోనియా)ను ఓడించింది. అదే జోరులో 6-2తో క్వింటి రొఫెన్ (నెదర్లాండ్స్)పై నెగ్గింది. ప్రిక్వార్టర్స్‌లో దీపికా జర్మనీకి చెందిన మిచెల్ క్రూపెన్తో తలపడనుంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్లో భజన్ కౌర్ సైతం ప్రిక్వార్టర్స్ చేరిన విషయం విదితమే. పురుషుల రౌండ్ ఆఫ్-32 ఎలిమినేషన్లో తరుణ్‌దీప్ రాయ్ 4-6తో టామ్ హాల్(బ్రిటన్) చేతిలో ఓటమితో నిష్క్రమించాడు.