మహబూబ్‌నగర్ టౌన్: ఆటలు ఆడటం వలన మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పల్లెలు, పట్ణణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్, బాస్కెట్‌బాల్ కోర్టు, ఆర్చరీ రేంజ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.7.09 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. అందుకే పల్లె, పట్టణ ప్రగతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లా కేంద్రంలో కనీసం వాకింగ్ ట్రాక్ ఉండేది కాదని, అలాంటిది ప్రధాన స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు క్రీడా కోర్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.