హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు టార్పెడోస్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో బెంగళూరు 15-13, 16-14, 15-13తో ముంబై మీటియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు వరుస సెట్లలో ముంబైని చిత్తుగా ఓడించింది. దీంతో పీవీఎల్ నాలుగో సీజన్లో బెంగళూరు రూపంలో కొత్త చాంపియన్ అవతరించింది. తొలి సీజన్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్, రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్, మూడో సీజన్లో కాలికట్ హీరోస్ టైటిళ్లు దక్కించుకున్నాయి.
తుది పోరు విషయానికొస్తే.. బెంగళూరు తరఫున పీటర్ ఒస్టిక్ బ్లాక్‌లకు తోడు జోయెల్ బెంజిమెన్ స్పైక్‌లతో ముంబైని సమర్థంగా నిలువరించారు. శుభమ్ చౌదరి స్పైక్‌లను జిష్ణు బ్లాక్ చేయడంతో బెంగళూరు శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అనవసర తప్పిదాలు ముంబైని ఓటమి వైపు నిలిపాయి. మూడో సెట్లో జులెన్ పెన్రోస్ బెంగళూరు జట్టులో చేరడంతో మెరుపు స్పైక్‌లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆఖర్లో నిఖిల్ సర్వీస్ తప్పిదంతో బెంగళూరు టైటిల్ విజేతగా నిలిచింది.