Bengaluru Stampede | బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా ఇచ్చిన నివేదికను కర్నాటక మంత్రివర్గం ఆమోదించింది. జూన్ 4న స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా.. పెద్దసంఖ్యలో గాయపడ్డారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమావేశం తర్వాత కర్నాటక శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా నివేదికను ఆమోదించి.. దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రైవేటు సంఘాలు, ఆర్సీబీ, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ వంటి సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అధికారులపై శాఖాపరమైన విచారణను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. తొక్కిసలాట, నిర్లక్ష్యానికి కారణమైన వారి పేర్లను జస్టిస్ డి’కున్హా నివేదికలో పేర్కొన్నారని చెప్పారు. తొక్కిసలాట ఘటన తర్వాత జూన్ 5న సీఎం సిద్ధరామయ్య న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ దయానంద్, అదనపు కమిషనర్ (పశ్చిమ) వికాస్ కుమార్ వికాస్లను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-18వ ఎడిషన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి గెలిచింది. దాంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహించిన విజయోత్సవ పరేడ్ నిర్వహించగా.. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడం.. స్టేడియం వెలుపల భారీగా జనం గుమిగూడడంతో తొక్కిసలాట చోట చోటు చేసుకుంది.