Ben Stokes | ముల్తాన్: సుమారు రెండునెలల పాటు జాతీయ జట్టుకు దూరమైన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మళ్లీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న స్టోక్స్.. పాకిస్థాన్‌తో ముల్తాన్ వేదికగా మంగళవారం నుంచి మొదలుకాబోయే రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. రెండో టెస్టుకు సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్‌కు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా అతడి స్థానంలో స్టోక్స్ తుది జట్టులోకి రానున్నాడు.
యువ బౌలర్ గస్ అట్కిన్సన్ స్థానాన్ని మాథ్యూ పాట్స్ భర్తీ చేయనున్నాడు. పాకిస్థాన్ కూడా తమ తుదిజట్టులో పలు మార్పులు చేయనుంది. ఇదివరకే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షహీన్ షా అఫ్రిది వంటి సీనియర్లను పక్కనబెట్టిన పాక్.. రెండో టెస్టులో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండగా రెండో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.