IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. కానీ, చివరి టెస్ట్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మైదానంలో ఆటగాళ్ల మధ్య చాలా విభేదాలు కనిపించాయి. అయితే, కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఐదవ మ్యాచ్‌లో జరిగిన ఘటనపై ఇంకా చర్చ సాగుతూనే ఉన్నది. ఇది టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్‌కు సంబంధించింది. అయితే, ఇందులో ఫాస్ట్ బౌలర్ తప్పేం లేకపోయినా ఇంగ్లిష్ ప్లేయర్ బెన్ డకెట్ కోచ్ ఆకాశ్ దీప్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డకెట్‌ను ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఆకాశ్ దీప్ డకెట్ భుజంపై చేసి వేసి మాట్లాడడం కనిపించింది. ఈ సమయంలో ఆకాశ్ దీప్ నవ్వుతూ ఏదో చెప్పాడు. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఈ సిరీస్‌లో డకెట్‌ను ఆకాశ్‌దీప్ పలుసార్లు అవుట్ చేశాడు.
పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో డకెట్ వద్దకు చేరుకోవడంతో కేఎల్ రాహుల్ ఆకాశ్‌ను దూరం తీసుకువెళ్లాడు. సిరీస్ ముగిసిపోయినా ఇందుకు సంబంధించి వివాదం కొనసాగుతున్నది. పలువురు క్రికెట్ పండితులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశ్‌దీప్ అలా చేసి ఉండకూడదని పేర్కొంటున్నారు. అయితే, బ్యాట్స్‌మెన్ అవుట్ అయినప్పుడు చాలా కోపంగా ఉంటారని పేర్కొంటున్నారు. ఆకాశ్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా డకెట్ వ్యక్తిగత కోచ్ జేమ్స్ నాట్ మాత్రం కొన్ని మ్యాచుల నుంచి నిషేధించాలని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐసీసీని డిమాండ్ చేశారు. ఇదంతా సిరీస్‌లో భాగమైనా.. యువ ఆటగాళ్లు ఇలాంటి వాటి నుంచి ప్రేరణ పొందకుండా ఉండేందుకు ఆకాశ్‌దీప్‌పై నిషేధం విధించాలని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. ఈ సిరీస్‌లో డకెట్ 51.33 సగటుతో 462 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 82.94గా ఉన్నది. డకెట్ చాలా ప్రశాంతమైన బ్యాట్స్‌మెన్ అని.. చాలాపోటీతత్వం అతనిలో ఉందని నాట్ తెలిపారు.