BCCI : భారత క్రికెట్ అభిమానులకు మరో తీపి కబురు. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ రానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) సమయంలోనే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుండగానే వరల్డ్ కప్ మ్యాచ్ తేదీలను వెల్లడిస్తాం’ అని ఆయన చెప్పాడు.
ఈ రోజు అహ్మదాబాద్లో బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ (Special General Meeting)జరిగింది. వరల్డ్ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాల్లో వసతులు, ఏర్పాట్ల గురించి ప్రధానంగా చర్చించారు. ఆయా మైదానాల మరమ్మతు, సుందరీకరణ కోసం నిధులు విడుదల చేసేందుకు కమిటీల ఏర్పాటుపై అధ్యక్షుడు రోజర్ బిన్ని, సెక్రటరీ జైషా తదితరులు దృష్టి సారించారు. ఆదివారం జరగనున్న ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ తర్వాత కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రపంచ చాంపియన్షిప్ 2023 టెస్టు గదతో కమిన్స్, రోహిత్ శర్మ
ఈ ఏడాది వరల్డ్ కప్(ODI WC 2023) స్వదేశంలో అక్టోబర్ – నవంబర్ మధ్య జరగనుంది. దాంతో, సొంత గడ్డపై రెండోసారి ట్రోఫీ అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా టీమిండియా గెలవలేదు. అందుకని వన్డే వరల్డ్ కప్ పోటీలను రోహిత్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.