IPL | ఢిల్లీ: క్రికెట్ అభిమానులను గత 17 సీజన్లుగా అలరిస్తున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో రాబోయే మూడేండ్ల షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. సాధారణంగా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు తేదీలను వెల్లడించే సంప్రదాయానికి చెక్ పెడుతూ.. వచ్చే మూడు సీజన్లకు సంబంధించిన తేదీలను ఫ్రాంచైజీలతో పంచుకుంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 14న మొదలై మే 25తో ముగియనుంది. 2026లో మార్చి 15 నుంచి మే 31తో జరుగబోయే ఈ మెగా లీగ్.. 2027లో మార్చి 14న ప్రారంభమై మే 30 దాకా సాగుతుందని పేర్కొంది. 2026, 2027 ఎడిషన్లలో లీగ్ మ్యాచ్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. ఐపీఎల్లో గత కొంతకాలంగా విదేశీ ఆటగాళ్ల ఇతర ఒప్పందాలు ఈ లీగ్ షెడ్యూల్తో క్లాష్ అవుతున్నాయని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ.. రాబోయే మూడేండ్లకూ షెడ్యూల్ను ముందుగానే ప్రకటించింది.