న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐ.. వచ్చే ఐదేండ్లకు సంబంధించిన మీడియా హక్కుల విక్రయం ద్వారా భారీ ఆదాయం సమకూర్చుకుంది. 2023-28 మధ్య స్వదేశంలో బీసీసీఐ నిర్వహించనున్న మ్యాచ్‌లకు సంబంధించిన మీడియా హక్కులను వయాకామ్-18 దక్కించుకుంది. టీవీ, డిజిటల్ రైట్స్‌కు గానూ వయాకామ్ రూ. 5,963 కోట్లు చెల్లించనుంది.
ఇందులో టీవీ ప్రసారాలకు రూ. 2862 కోట్లు, డిజిటల్ ప్రసారాలకు రూ. 3101 కోట్లుగా బిడ్లు వేసింది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అంతర్జాతీయంగా 88 మ్యాచ్‌లు ప్రసారం చేసే హక్కులను వయాకామ్ దక్కించుకుంది. ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఉన్నాయి. అంటే ఒక్కో మ్యాచ్‌కు బోర్డుకు 67.76 కోట్లు దక్కనున్నాయి. ఈ వేలంలో వయాకామ్‌కు సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ప్రసార హక్కులు సొంతం చేసుకున్న వయాకామ్ 18కు బీసీసీఐ కార్యదర్శి జై షా అభినందనలు తెలిపాడు. ‘వచ్చే ఐదేండ్లలో భారత క్రికెట్లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయి’ అని జై షా ట్వీట్ చేశాడు.