ఢిల్లీ: దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రకటనతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దెన తర్వాత.. సరిహద్దుల్లో యుద్ధ తీవ్రత నేపథ్యంలో బీసీసీఐ ఈ లీగ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో బీసీసీఐ మళ్లీ ఈ లీగ్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నది. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే పలువురు ఆటగాళ్లను తమ దేశానికి పంపించాయని, ఇప్పట్లో ఈ లీగ్ జరగడం అనుమానమేనని వార్తలు వస్తుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ అనంతరం.. తాజా సీజన్‌ను జూన్ మొదటివారం లోపు పూర్తిచేయాలనే పట్టుదలతో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.
ఈ మేరకు ఆదివారం బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలితో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి యుద్ధం ఆగింది. లీగ్ పునరుద్ధరణపై ఆదివారం బీసీసీఐ.. ఆఫీస్ బేరర్లు, అధికారులు, ఐపీఎల్ పాలకమండలి సభ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది’ అని తెలిపారు. అన్నీ కుదిరితే వచ్చే శుక్రవారం (మే 16న) ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సరిహద్దుల్లో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను ఉత్తరాదిలో కాకుండా పూర్తిగా దక్షిణాదిలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్‌కు సరిహద్దు రాష్ర్టాల్లో ఉన్న అహ్మదాబాద్, జైపూర్, ధర్మశాల, చండీగఢ్‌లో కాకుండా దక్షిణాదిలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో మ్యాచ్‌లను నిర్వహించడమే మంచిదని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై శుక్లా స్పందిస్తూ.. ‘అవును. అది మా ఆప్షన్లలో ఒకటి. యుద్దం జరుగుతున్నప్పుడు మేం చాలా ప్రత్యామ్నాయాలను పెట్టుకున్నాం. కాల్పుల విరమణను ఇప్పుడే ప్రకటించారు. మాకు కొంత సమయమివ్వండి. చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. 18వ సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు మిగిలున్న విషయం తెలిసిందే.