న్యూఢిల్లీ : జూనియర్ క్రికెట్లో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమైంది. పలువురు క్రికెటర్లు నకిలీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తూ వయసు విభాగపు లీగ్‌లో ఆడుతున్న నేపథ్యాలను దృష్టిలో పెట్టుకుని బోర్డు పలు నిర్దిష్టమైన మార్పులు చేసింది. ఇందులో ఆయా వయసు విభాగాల్లో పోటీపడే యువ క్రికెటర్లకు ‘బోన్ టెస్టు’ ఆధారంగా ఆడేందుకు అనుమతి ఇచ్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న ఎముకల సాంద్రతను కొలిచే టీడబ్ల్యూ3 పద్ధతికి తోడు ఏ+1 విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వచ్చే సీజన్లో సదరు ప్లేయర్ ఆడేందుకు కావాల్సిన ప్రమాణాలను స్పష్టంగా పేర్కొంది. సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా ఏ ఒక్క ప్లేయర్ మ్యాథమెటికల్‌గా వయసు నిర్ధారణ అర్హత కోల్పోయే అవకాశముండదని బోర్డు తెలిపింది.
బాలుర అండర్-16 విభాగంలో బోన్ ఏజ్ కటాఫ్‌ను 16.5 సంవత్సరాలుగా, బాలికల అండర్-15కు 15 ఏండ్లుగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్లేయర్ బోన్ ఏజ్ 16.4 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే అతను తర్వాత సీజన్లో ఆడేందుకు అర్హుడు. బాలికల్లో ఇది 14.9కు పరిమితం చేసినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు బాలుర అండర్-16లో ఒక ప్లేయర్ 2025-26 సీజన్లో ప్లేయర్ బోన్ టెస్టుకు హాజరై అతని ఫలితం 15.4 ఏండ్లు ఉంటే అతను వచ్చే సీజన్లో మళ్లీ పరీక్షకు హాజరు కానవసరం లేదు. ఏ+1 పద్ధతి ప్రకారం అతని వయసు 16.4 అవుతుందని కావున నిబంధనల ప్రకారం అర్హుడు అవుతాడు. ఒకవేళ ప్లేయర్ బోన్ ఏజ్ 15.5 ఏండ్లు ఉంటే అతను వచ్చే సీజన్లో ఆడేందుకు అర్హత కోల్పోతాడని బోర్డు స్పష్టం చేసింది.